బెట్టింగ్ జోరు | betting josh in elections | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ జోరు

Published Mon, May 5 2014 2:30 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

బెట్టింగ్ జోరు - Sakshi

బెట్టింగ్ జోరు

సార్వత్రిక ఫలితాల పందేరం జిల్లాలో ఉపందుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ప్రధానంగా ఓ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజారిటీపై మన జిల్లాతో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పందేలు పెట్టుకుంటున్నారు.

  • ఓ ఎంపీ అభ్యర్థి మెజారిటీపై రూ.లక్షల్లో పందెం
  • జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఈ సీటుపైనే బెట్టింగులు
  •  సాక్షి, ఖమ్మం: సార్వత్రిక ఫలితాల పందేరం జిల్లాలో ఉపందుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ప్రధానంగా ఓ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజారిటీపై మన జిల్లాతో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పందేలు పెట్టుకుంటున్నారు. అలాగే ఓ ప్రధాన పార్టీకి జిల్లాలో అసలు ప్రాతినిధ్యం కూడా కష్టమేనన్న దానిపైనా బెట్టింగ్ కొనసాగుతోంది. ఫలితాల వెలువరించే రోజు దగ్గరపడుతున్న కొద్దీ బెట్టింగ్ జోరు అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది.
     
     పోలింగ్ అనంతరం జిల్లాలో అన్ని పార్టీల నేతలు విజయంపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. పల్లెలు, పట్టణాల వారీగా లెక్కలు వేసుకొని కొంతమంది గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మా త్రం కష్టమేనన్న భావనలో ఉన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో ఓ పార్టీకి స్పష్టమైన విజయం కళ్లముందు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులలో మూడు స్థానాలు మినహా మిగతా ఏడు చోట్ల ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థి ఆధిక్యతపై జిల్లాలో పందేరం జోరందుకుంది. రూ.లక్షల్లో ఈ బెట్టింగ్ సాగుతుండడం గమనార్హం. సదరు పార్టీ అభ్యర్థికి లక్ష, లక్షన్నర ఓట్ల పైగా మెజారిటీ ఉంటుందని పందెం కాస్తున్నారు. పట్టణ కేంద్రాల్లో ఇది రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉండగా మండల కేంద్రాల్లో రూ.లక్ష వరకు నడుస్తోంది. గెలుపు ఖాయమని జిల్లా అంతటా చర్చ వ్యాపించడంతో సదరు ఎంపీ అభ్యర్థికి మెజారిటీ ఎంత వస్తుందోనని ఇతర  పార్టీలు కూడా అంచనాల్లో మునిగాయి. ఊహించని స్థాయిలో మెజారిటీ వస్తే తమ పార్టీపై ఓటర్లకు నమ్మకం పోయినట్లేనని నేతలు భావిస్తున్నారు. జిల్లాలో ఎంపీ అభ్యర్థి మెజారిటీపై భారీ ఎత్తున బెట్టింగ్ కొనసాగడం ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
     
     జిల్లా దాటిన పందేరం..
     ఓ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజారిటీపై కొనసాగుతున్న పందేరం జిల్లా దాటి సరిహద్దునున్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, ఏలూరు, గణపవరం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కృష్ణా జిల్లాలోని కైకలూరు, జగ్గయ్యపేట, మైలవరంలో రూ. లక్షల్లో పందేరం నడుస్తోంది. ఈ జిల్లాల్లోని ప్రజలకు.. మన జిల్లా వారితో బంధుత్వం ఉండడంతో ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ పార్టీ బలం ఎంత.. ఎవర గెలుస్తారనే సమాచారం తీసుకుంటున్నారు. జిల్లాలోని పార్టీ నేతలు, వ్యాపారులు, విద్యావేత్తలు, బంధువులు ఇచ్చే సవ చారంతో ఈ జిల్లాల్లో పందేరం రోజురోజుకూ వేడెక్కుతోంది. అంతేకాకుండా గ్రూపుల వారీగా రూ.కోటిపైన పందెం కాస్తున్నట్లు సమాచారం. ఒక్కో గ్రూపులో 10 నుంచి 20 మంది వరకు సభ్యులుగా ఉండి రూ.కోటిపైగా బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలిసింది. ఫలితాల రోజు క్షణాల్లో సమాచారం తెలుసుకునేందుకు పందెం రాయుళ్లు అవసరమైతే తమ వేగులను ఈ జిల్లాల నుంచి ఖమ్మం పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
     
     ఒక పార్టీకి వస్తాయని..
     ఎంపీ అభ్యర్థి బెట్టింగ్ ఒక రకంగా ఉంటే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి మరోలా ఉంది. జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఒకే పార్టీకి దక్కుతాయని.. దక్కవని పందెం కాస్తున్నారు. ఆ నాలుగు స్థానాలు ఒకే పార్టీ కైవసం చేసుకుంటే రూ.లక్ష, ఆ పార్టీకి మూడు స్థానాలు వస్తే రూ.75 వేలు, రెండు వస్తే రూ.50 వేలు, ఒకటి వస్తే రూ.25 వేలు.. ఇలా బెట్టింగ్‌లు కాస్తున్నారు. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఈ పందేరం జోరందుకుంది. చోటామోటా నాయకులు, కార్యకర్తలు రూ.వేలల్లో పందేనికి సై అంటున్నారు. ఈ రకమైన పందేరం ఎక్కువగా జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మం, మధిరలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఓ ప్రధాన పార్టీకి జిల్లాలో ఎంపీతో పాటు, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదని పందేలు కాస్తున్నారు.

     ఒక్క ఎమ్మెల్యే స్థానం వచ్చినా రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పందెం కాయడానికి వెనుకాడడం లేదు. జిల్లాలో రాజకీయంగా ఏది జరిగినా అది పొరుగు జిల్లాలకు వెంటనే వ్యాపిస్తుంది. ఇలాగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా మిగతా జిల్లాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. కాగా, తమ విజయం.. ఓటమిపై రూ.లక్షల్లో పందేలు కొనసాగుతుండడంతో అభ్యర్థులలో గుబులు రేకెత్తుతోంది. ఇప్పటికే తమకు ఓటమి తప్పదని అనుకుంటున్న నాయకులకు ఈ బెట్టింగ్‌లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement