అద్వానీకి భంగపాటు | BJP declines Bhopal seat to LK Advani | Sakshi
Sakshi News home page

అద్వానీకి భంగపాటు

Published Thu, Mar 20 2014 2:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

అద్వానీకి భంగపాటు - Sakshi

అద్వానీకి భంగపాటు

 అగ్ర నేత భోపాల్ సీటు ఆశలపై నీళ్లు
 గాంధీనగర్ నుంచే ఆయన తిరిగి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయం
 మోడీ పోటీ చేసే రెండో స్థానం వడోదరా
 67 మంది అభ్యర్థులతో ఐదో జాబితా

 
 న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ(86)కి సొంత పార్టీ నుంచే ఘోర అవమానం ఎదురైంది. గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఉన్న విభేదాల కారణంగా ఐదుసార్లు పోటీ చేసిన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానానికి బదులుగా ఈసారి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బరిలో దిగాలనుకున్న ఆయన ఆశలపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నీళ్లుచల్లింది. పార్టీలోని సీనియర్లకు కోరుకున్న చోట సీట్లు కేటాయిస్తున్న తరహాలో తనకు కూడా భోపాల్ స్థానాన్ని కేటాయించాలన్న ఆయన డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మోడీ కోసం భోపాల్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమని పార్టీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత కైలాశ్ జోషీ ప్రకటించినా బీజేపీ అధిష్టానం మాత్రం అద్వానీకి ఆ సీటును కేటాయించేందుకు ససేమిరా అంది. అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్ స్థానం నుంచే తిరిగి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అద్వానీ, మోడీల మధ్య నెలకొన్న విభేదాలను ప్రతిఫలించినట్లు అయింది. మరోవైపు మోడీ పోటీ చేయబోయే రెండో స్థానంగా గుజరాత్‌లోని వడోదరా సీటును పార్టీ ఖరారు చేసింది. మోడీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి పోటీ చేయనుండటం తెలిసిందే.
 
 రోజంతా చర్చోపచర్చలు...
 
 అద్వానీకి కేటాయించే సీటు విషయంలో నిర్ణయం తీసుకోవడంపై బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అయితే ఈ సమావేశానికి అద్వానీ హాజరుకాలేదు. సమావేశంలో మోడీ మాట్లాడుతూ...అద్వానీ తిరిగి గాంధీనగర్ స్థానం నుంచే పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ భేటీకి ముందు అద్వానీ...పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడినట్లు తెలిసింది. ఇతర సీనియర్ నేతల తరహాలో తనకు కూడా నచ్చిన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే హక్కు ఉండాలని అద్వానీ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, అద్వానీ తిరిగి గాంధీనగర్ నుంచి పోటీ చేసేలా బుజ్జగించేందుకు ఎన్నికల కమిటీ సమావేశానంతరం సుష్మాస్వరాజ్, గడ్కారీలు అద్వానీ ఇంటికెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తనను గాంధీనగర్ నుంచి పోటీకి దింపడంపై అద్వానీ వారి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత సుష్మా, గడ్కారీలు రాజ్‌నాథ్ ఇంటికి వెళ్లి అద్వానీ అసంతృప్తి గురించి తెలిపారు. మరోపక్క  మోడీ... ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసుకు వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో భేటీ అయ్యారు. అద్వానీకి గాంధీనగర్ సీటును ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో చెప్పి, ఎన్నికల వ్యూహం తదితరాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భాగవత్ అద్వానీతో మాట్లాడినట్లు వార్తలొచ్చినా సంఘ్, బీజేపీలు ధ్రువీకరించలేదు. మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అద్వానీ నిరసన స్వరం వినిపిస్తున్నారు. గాంధీనగర్ నుంచి పోటీపై అద్వానీ అనాసక్తికి సంబంధించి రెండు వాదనలు ఉన్నాయి. మోడీతో బెడిసిన సంబంధాల నేపథ్యంలో తన ఓటమికి కుట్ర జరుగుతుందేమోనని అద్వానీ భయపడుతున్నారనేది ఒక వాదన కాగా, గెలుపు కోసం మోడీపై ఆధారపడుతున్నాననే భావన రాకూడదని అద్వానీ ఆ సీటును వద్దనుకున్నారన్నది మరో వాదన.
 
 మథుర బరిలో హేమమాలిని
 
 ఎన్నికల కమిటీ సమావేశానంతరం బీజేపీ నేత తార్వాచంద్ గెహ్లాట్ 67 మంది అభ్యర్థుల పేర్లతో ఐదో జాబితాను ప్రకటించారు. యూపీలోని మథుర స్థానం నుంచి నిన్నటితరం బాలీవుడ్ హీరోయిన్ హేమమాలిని, రాజస్థాన్‌లోని జైపూర్ (రూరల్) స్థానం నుంచి ఒలింపిక్ పతక విజేత రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ పోటీచేస్తారన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన  దొమారియాగంజ్ (యూపీ) ఎంపీ జగదాంబికా పాల్‌కు ఈ జాబితాలో అదే స్థానం నుంచి టికెట్ లభించింది. కాగా, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వరుసగా 15, 17 మంది అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement