అ..శోకం!
కింజరాపు ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు
నరసన్నపేట కోసం ఈ సీటుకు నీళ్లొదిలారు
బెందాళం కుటుంబానికి.. కాపు సామాజికవర్గానికి అన్యాయం
అత్యధికంగా ఉన్న కాళింగులకు ఒక్కసీటుతో సరి
భగ్గుమంటున్న ఆ సామాజికవర్గీయులు
మరోవైపు కాపు సామాజికవర్గం పరిస్థితీ అదే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎడతెగకుండా టీడీపీ, బీజేపీల మధ్య సాగిన పొత్తు చర్చల్లో ఆదివారం రాత్రి సీట్ల సర్దుబాటులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు.. ఇదే అదనుగా కింజరాపు కుటుంబం టీడీపీ అధినేతపై ఒత్తిడి తెచ్చి.. తాము అనుకున్నది సాధించింది. నరసన్నపేటను కాపాడుకునేందుకు ఇచ్ఛాపురాన్ని బీజేపీకి ధారాదత్తం చేసేలా అధినేతను ఒప్పించింది. కింజరాపు రాజకీయ ఎత్తులో బెందాళం కుటుంబం మరోసారి నలిగిపోయింది. వాస్తవానికి ఇచ్ఛాపురం టిక్కెట్ బెందాళం అశోక్‌కేనని అటు చంద్రబాబు.. ఇటు కింజరాపు కుటుంబం నమ్మించింది. తమకు విధేయుడైన బెందాళం ప్రకాష్ కుమారుడు అశోక్‌కు ఆ మేరకు కింజరాపు అచ్చెన్న అభయం ఇచ్చేశారు. దాంతో బెందాళం తనకున్నదంతా ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ పొత్తులో భాగంగా నరసన్నపేటను బీజేపీకి కేటాయించడం కింజరాపు కుటుంబానికి ఏమాత్రం నచ్చలేదు.
తమ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నరసన్నపేట బదులు పాతపట్నాన్ని బీజేపీకి కేటాయించాలని మొదట పట్టుబట్టింది. కానీ కార్పొరేట్ లాబీ సహకారంతో శత్రుచర్ల ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. దాంతో కింజరాపు కుటుంబం ఇచ్ఛాఫురం నియోజకవర్గంపై దృష్టి సారించింది. అక్కడి ఇన్‌చార్జి అశోక్ బలహీనంగా ఉన్నారని చంద్రబాబు వద్ద వాదించింది. ప్రధానంగా ఆయన ఆర్థికంగా బలహీనుడనే విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. దాంతో డబ్బుకే ప్రాధాన్యమిచ్చే టీడీపీ కార్పొరేట్ లాబీ అశోక్‌ను టార్గెట్ చేసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించేలా పావులు కదిపింది. అటు కింజరాపు కుటుంబానికి.. ఇటు శత్రుచర్లకు ఇబ్బందిలేకుండా ఉండేలా ఈ ప్రతిపాదన చేశారు. చంద్రబాబుతో ఆమోదింపజేశారు.
బెందాళం వేదన అరణ్యరోదనే!
ఇచ్ఛాపురం టిక్కెట్టు కాపాడుకోవడానికి బెందాళం ప్రకాష్, అశోక్‌లు చివరికంటా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీని.. కింజరాపు కుటుంబాన్ని నమ్ముకున్న తమకు అన్యాయం చేయొద్దని ఆ తండ్రీకొడుకులు ఎంతగా వేడుకున్నా చంద్రబాబు వారి మొర ఆలకించ లేదు. కార్పొరేట్ లాబీ కనుసన్నల్లో నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో వారి వేదన అరణ్యరోదనే అయ్యింది. నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ప్రకాష్, అశోక్‌లతో ఆదివారం కూడా పలు దఫాలుగా మాట్లాడారు. ‘మీరెంత ఖర్చు చేయగలరు?.. మీకు అంత స్థోమత లేదు కదా?.. ఎందుకు పోటీ పడటం.. తప్పుకోండి.. తర్వాత మీ గురించి ఆలోచిస్తాం’ అని అసలు విషయాన్ని చెప్పేసినట్లు తెలుస్తోంది. కానీ చివరివరకు చంద్రబాబును కలిసి టిక్కెట్టు సాధించాలని ప్రకాష్, అశోక్‌లు శతవిధాలా యత్నించారు.మరోవైపు అచ్చెన్న, రామ్మోహన్‌లకు పలుమార్లు ఫోన్లు చేసి మరీ తమకు సహకరించమని వేడుకున్నారు. కానీ వారు ఏమాత్రం స్పందించలేదని తెలుస్తోంది. చివరికి ఫోన్‌కాల్స్ కూడా రిసీవ్ చేసుకోకుండా తమ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పేశారు. దాంతో బెందాళం ఆశలు ఆవిరయ్యాయి.
కాళింగులకు మొండిచెయ్యి
తాను కాళింగ సామాజికవర్గానికి వ్యతిరేకమని టీడీపీ తన నిర్ణయాలతో మరోసారి నిరూపించింది. జిల్లాలో అత్యధికంగా ఉన్నప్పటికీ కాళింగ సామాజికవర్గాన్ని టీడీపీ మొదటి నుంచి పూర్తిగా విస్మరిస్తూ వస్తోంది. ప్రధానంగా కింజరాపు ఎర్రన్నాయుడు ప్రాబల్యం పెరిగినప్పటి నుంచి కాళింగ సామాజికవర్గానికి పార్టీలో గుర్తింపు లేకుండాపోయింది. ఎర్రన్నాయుడు తదనంతరం కూడా అదే విధానం కొనసాగుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో కాళింగ సామాజికవర్గం అత్యధికంగా టెక్కలి, ఆమదాలవలస, పలాస నియోజకవర్గాల్లో ప్రభావశీల పాత్ర పోషించే స్థితిలో ఉంది. ఇచ్ఛాపురం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో కూడా ఆ వర్గం ఓటర్లు గణనీయంగానే ఉన్నారు. కానీ టీడీపీ ఆ సామాజికవర్గానకి ఒక్క ఆమదాలవలసతోనే సరిపెట్టింది.
కాళింగులు అత్యధికంగా ఉన్న టెక్కలి నియోజకవర్గాన్ని వెలమ వర్గీయుడైన కింజరాపు అచ్చెన్నాయుడుకు ఇచ్చారు. పలాసలో శ్రీశయన వర్గానికి చెందిన శివాజీకి లేదా ఆయన కుమార్తెకు ఇస్తున్నారు. ఇక ఎంపీ టిక్కెట్టుకు కూడా కింజరాపు రామ్మోహన్‌నాయుడుకే కేటాయించారు. పోనీ ఇచ్ఛాపురమైనా కేటాయిస్తారు కదా అని కాళింగ సామాజికవర్గీయులు సరిపెట్టుకున్నారు. ఇప్పుడు దాన్నీ లాక్కుపోయారు. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించి టీడీపీ చేతులు దులుపుకుంది. వెలమ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నరసన్నపేటను ముందు బీజేపీకి కేటాయించింది. కానీ కింజరాపు కుటుంబం పట్టుబట్టి మరీ నరసన్నపేటను టీడీపీకే ఉంచేలా చేసింది. దానికి బదులు కాళింగ సామాజికవర్గానికి కేటాయించిన ఇచ్ఛాఫురం స్థానాన్ని బీజేపీకి ఇప్పించింది. తద్వారా కాళింగ సామాజికవర్గాన్ని టీడీపీ పూర్తిగా విస్మరించింది. ఈ పరిణామాలపై జిల్లాలోని కాళింగ సామాజికవర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రానున్న ఎన్నికల్లో కింజరాపు కుటుంబానికి, టీడీపీకి ప్రతికూలంగా పనిచేసి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మరో ప్రధాన సామాజికవర్గమైన కాపులకు టీడీపీ ఇప్పటికే అన్యాయం చేసింది. పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో ఈ సామాజికవర్గీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీటిలో పాలకొండ, రాజాం రిజర్వేషన్ వర్గాలకు పోగా.. పాతపట్నం నియోజకవర్గాన్ని క్షత్రియ వర్గానికి చెందిన శత్రుచర్ల విజయరామారాజును ఖరారు చేస్తోంది. ఒక్క ఎచ్చెర్లను మాత్రం కాపు సామాజికవర్గానికి కేటాయించి సరిపెట్టింది. ఈ పరిణామాలు టీడీపీలో సామాజిక న్యాయానికి అవకాశం లేదని తేటతెల్లం చేస్తున్నాయి.