ఎవరికి ఓటేసినా, పడేది బిజెపికే
మీరు ఏ పార్టీకైనా ఓటేయండి. ఏ మీట నొక్కినా మీ ఓటు మాత్రం పడేది భారతీయ జనతా పార్టీ కే! ఇదేదో బిజెపి బెంగాల్ అభ్యర్థి పిసీ సర్కార్ మహేంద్ర జాలం కాదు. అసొం లోని జోర్హాట్ లోకసభ నియోజకవర్గంలో అధికారులు మాక్ పోల్ పరీక్ష నిర్వహించినప్పుడు ఈ వీ ఎంలు ఇలా వింతగా ప్రవర్తించాయి. ఈ తంతు అంతా అన్ని పార్టీల ఎంపీ అభ్యర్థుల సమక్షంలో జరిగింది.
జోర్హాట్ నుంచి మాజీ కేంద్ర మంత్రి విజయ కృష్ణ హాండిక్, బిజెపి గిరిజన నేత కామాఖ్యా తాసాలు పోటీ పడుతున్నారు. ఈ ఈ వీఎంలు మన హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఈ మధ్యే జోర్హాట్ వచ్చాయి. వాటిని పరీక్షిస్తుండగా ఈ సంగతి బయటపడింది.
ఈ ఈ వీఎంలు జిల్లా కమీషనర్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. అలా ఉంచినప్పుడు ఎవరైనా వీటిని ఇలా చేశారా అన్నది అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ దీనిపై ఫిర్యాదు చేసింది. ఒక్క జోర్హాట్ లోనే కాదు, రాష్ట్రమంతటా ఈవీఎంలను పరీక్షించాలని డిమాండ్ చేసింది. 'మేము కాంగ్రెస్ కి ఓటేసినా అది బిజెపి ఖాతాలోకే వెళ్తోంది,' అని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది.
తమాషా ఏమిటంటే 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే చేసిందని, తమ ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయని అసొంలో ప్రధాన ప్రతిపక్షం అసొం గణపరిషత్ అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే ఇవన్నీ నిరాధారమని, ఈవీఎం ఫలితాలను ఎవరూ తారుమారు చేయలేరని కాంగ్రెస్ వాదించింది. సుబ్రమణ్యం స్వామి వంటి నేతలు కూడా ఈవీఎం ఫలితాలను తారుమారు చేయవచ్చునని కోర్టుకెక్కారు. అప్పుడు కూడా కాంగ్రెస్ ఇదే వాదనను వినిపించింది. ఇప్పుడు తనదాకా వచ్చే సరికి మాత్రం కాంగ్రెస్ రాష్ట్రమంతటా పరీక్షించాలని డిమాండ్ చేస్తోంది.