సాక్షి, కడప : సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రధాన పార్టీల తరుపున బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రచారంపై దృష్టి సారించారు. ఎన్నికల్లో ఓటర్లపై వల విసిరేందుకు రకరకాల ఎత్తుగడలను అవలంభిస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థులు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలను చుట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు చేదోడు వాదోడుగా కుటుంబ సభ్యులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు.
పగటివేళ గ్రామాల్లో ఓటర్లను కలుసుకుంటూ రాత్రి వేళల్లో అసంతృప్తి నేతలను బుజ్జగించడంతోపాటు చోటా మోటా నాయకులను తమవైపు తిప్పుకునేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. ఎన్నికలు తమ భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైనవిగా కావడంతో చావో రేవో అనే రీతిలో పోరాడుతున్నారు. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ప్రతి చిన్న అవకాశాన్నితమకు అనుకూలంగా మలుచుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. కులసంఘాల పెద్దలు, గ్రామ స్థాయి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. రకరకాల హామీలు గుప్పిస్తున్నారు.
ప్రణాళికతో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ
జిల్లాలో కడప, రాజంపేట లోక్‌సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారం ప్రణాళిక ప్రకారం సాగుతోంది. లోక్‌సభ అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను చుట్టి ఓటర్లతో మమేకమై అన్ని పార్టీల కంటే ముందంజలో ఉన్నారు. కీలక తరుణంలో మళ్లీ ఓటర్లకు చేరువయ్యేలా అన్ని నియోజకవర్గాల్లో తిరిగేలా కసరత్తు చేస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి ఏడు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యచరణ రూపొందించారు.
ఇందులో భాగంగా బద్వేలు, కడప, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. స్థానిక అసెంబ్లీ అభ్యర్థులను కలుపుకుని పంచాయతీ కేంద్రాలలో సభలు, పట్టణాల్లో రోడ్‌షోల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. రాజంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి సైతం వ్యూహాత్మకంగా జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో విసృ్తతంగా పర్యటించేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.
ఇంటిపోరుతో టీడీపీ సతమతం
నామినేషన్ల ప్రక్రియ ముగిసినా టీడీపీ ప్రచారంలో ముందుకు సాగలేకపోతోంది. వలస నేతలకు టిక్కెట్లను కట్టబెట్టడంతో పార్టీ కేడర్ నాయకత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. పులివెందులలో సైతం ఉన్న అత్తెసరు నేతల్లో విభేదాలు పొడచూపడంతో అక్కడ పోటీ నామమాత్రమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రచారంమాట దేవుడెరుగు..నాయకుల అసంతృప్తులు, అలకలు, బుజ్జగింపులతోనే విసిగి వేసారుతున్నారు.
రాజంపేట లోక్‌సభ టిక్కెట్‌ను బీజేపీకి కేటాయించడంతో అక్కడి శ్రేణులు పార్టీ నాయకత్వంపై రగిలిపోతున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థికి సహకరించే పరిస్థితులు కనిపించడంలేదు. అలాగే కడప అసెంబ్లీ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించింది. అయితే చివరి క్షణంలో పొత్తు ధర్మాన్ని విస్మరించి చంద్రబాబు మరొకసారి వెన్నుపోటుకు తెరతీశారు. టీడీపీ అభ్యర్థిగా దుర్గాప్రసాద్‌రావుకు బి.ఫారంను అందజేసి పోటీలో నిలిపారు. దీంతో బీజేపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీపై రగిలిపోతునాయి. జిల్లాలో టీడీపీకి సహకరించేది లేదని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ కనుమరుగు
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలోకి వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంటు బరిలో ముక్కు ముఖం తెలీని కొత్త అభ్యర్థులను వెతుక్కోవలసిన దుస్థితి నెలకొంది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మాజీమంత్రి అహ్మదుల్లా, డీఎల్ రవీంద్రారెడ్డి ‘చేయి’ ఇచ్చారు. చివరి క్షణంలో పోటీ నుంచి తప్పుకోవడంతో ఆఘమేఘాల మీద కొత్త నేతలను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
ప్రచార హోరు
Published Mon, Apr 21 2014 3:07 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement