కామారెడ్డి, న్యూస్‌లైన్ : పక్షం రోజులుగా ప్రచారాలు, ప్రలోభాల తో ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడ్డ అభ్యర్థులు ఇక ఓటరు దేవునిపై భారం వేశారు. బుధవారం వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాలు, రెండు పార్లమెంటు నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డారు. ప్రత్యర్థులకు దీటుగా హంగూ, ఆర్భాటాలతో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీ ల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలు ఎన్ని ఉన్నా అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశారు. ముఖ్యంగా కుల, యువజన సంఘాలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. కుల సంఘాలకు విందులు ఏర్పాటు చేయడంతో పాటు వారు కోరుకున్నట్టుగా డబ్బులు కూడా ముట్టజెప్పారు. కొందరు అభ్యర్థులు మాత్రం తమ చేతిలో ఉన్న అధికారంతో కుల సంఘాలకు భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామన్న హామీలు కూడా ఇచ్చారు.
కాగా ఎన్నికల వేళ ప్రధాన పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీలు మారారు. దీంతో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉత్కంఠభరితం గా మారాయి. అభ్యర్థుల అన్ని ప్రయత్నాలు ముగిశాయి. ఇక ఓటరు దేవుడిపైనే భారం మిగిలుంది. ఎవరు వెళ్లినా నీకే నా ఓటన్న ఓటరు చివరికి ఎవరికి వేస్తాడో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేసినా, అనేక హామీలతో సంతృప్తి పర్చినా చివరకు నిర్ణయించే ది ఓటరే కావడంతో అభ్యర్థులు ఓటరు దేవుని తీర్పుమీదే ఆశలు పెట్టుకున్నారు. లోపల ఎంత భయం ఉన్నా గెలుపుపై ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల బహుముఖ పోరు నెలకొన్న ప్రస్తుత తరుణంలో మరి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో వే చి చూడాలి.
ఓటరు దేవునిదే భారం
Published Wed, Apr 30 2014 2:41 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement