అభ్యర్థులకు కొత్త టెన్షన్ | Candidates new tension | Sakshi
Sakshi News home page

అభ్యర్థులకు కొత్త టెన్షన్

Published Fri, Mar 28 2014 4:03 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Candidates new tension

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అసంతృప్తులు, అలకలు, బెదిరింపుల పరిస్థితులను అధిగమించి టికెట్లు సంపాదించి ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఏప్రిల్ 6, 11వ తేదీల్లో ఎన్నికలు జరుపుకోమని చెప్పిన సుప్రీం కోర్టు మే 7వ తేదీ తర్వాతే ఫలితాలు ప్రకటించాలని గురువారం ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలే ఆపుతారా? లేక లెక్కింపు కూడా అప్పటి దాకా నిలుపుదల చేస్తారా? అనే ఆందోళన ప్రారంభమైంది. ఈ గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఏ విధమైన స్పష్టత ఇస్తుందోనని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నారు.


 రాజకీయ పార్టీలు ఊహించని విధంగా మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. దీంతో వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న, ఖరారైన అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తల్లకిందులైతే ఆ ప్రభావం తమ ఎన్నికల మీద పడుతుందని తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ ఎన్నికలు ఎలాగైనా ఆగిపోతే అదే పది వేలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటూనే ఉన్నారు. అసలైన ఎన్నికల పోరాటానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ పాడు ఎన్నికలు వచ్చిపడి తమకు నిద్రలేకుండా చేస్తున్నాయని కొందరు నాయకులైతే నేరుగా వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో తలెత్తిన వివాదాలను సరిచేసుకోవడానికి చాలా మంది నాయకులు తలకిందలయ్యారు. విపరీతమైన పోటీ నడుమ టికెట్లు సాధించిన వారు సైతం అందరినీ బుజ్జగించుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. మరో 15 రోజుల్లో ఈ టెన్షన్ తొలగిపోతుందని అందరూ భావించారు.


 అయితే సుప్రీం కోర్టు ఏప్రిల్ 6, 11వ తేదీల్లో ఎన్నికలు జరిగినా, ఫలితాలు మాత్రం మే 7వ తేదీ తర్వాతే ప్రకటించాలని గురువారం ఆదేశించింది. ఈ తీర్పు తమకు అనుకూలమా? ప్రతి కూలమా? అనేది అర్థం కాక పోటీలోని అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కంగారు పడుతున్నారు. కోర్టు తీర్పును అనుసరించి మే 7వ తేదీ దాకా ఓట్ల లెక్కింపు ఆపేస్తే తమ నెత్తిన పాలు పోసినట్లు అవుతుందని ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఆశపడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం ఎన్నికలు జరిగాక కూడా నెల రోజులు ఓట్ల లెక్కింపు జరపకపోతే తమ టెన్షన్ మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.

 మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నిలిపి వేయాలని హైకోర్టులో దాఖలైన కేసులపైన కూడా శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఉంటుందా? ఉండదా? అనే టెన్షన్ అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పును అనుసరించి ఫలితాలను మాత్రమే అధికారికంగా మే 7వతేదీ తర్వాత ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తే విజేతలెవరో, పరాజితులెవరో తేలిపోయే అవకాశం ఉన్నందున తమకు ఇబ్బందులు తప్పవనే భయం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి గందరగోళం నడుమ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement