బాబు, కేసీఆర్‌లు నిలకడ లేనోళ్లే: చాడ | Chada venkat reddy slams Chandrababu Naidu, KCR | Sakshi
Sakshi News home page

బాబు, కేసీఆర్‌లు నిలకడ లేనోళ్లే: చాడ

Published Fri, Apr 18 2014 4:10 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

Chada venkat reddy slams Chandrababu Naidu, KCR

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావులది నిలకడలేని మనస్తత్వం అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. బీజేపీతో  పొత్తు పెట్టుకోబోనని పశ్చాత్తాపం వ్యక్తం చేసిన బాబు... ఎన్నికలు వచ్చే సరికి  బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. గురువారమిక్కడ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ‘ఛీ పో’ అని చీదరించుకున్నా, చంద్రబాబు మాత్రం ఢిల్లీలో లాబీయింగ్ చేసుకొని పొత్తు పెట్టుకున్నారన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. అవసరం ఉంటే ఒకలా, అవసరం తీరాక మరోలా ప్రవర్తిస్తారని విమర్శించారు.
 
 రాజ్యసభ ఎన్నికలతో పాటు ఇతర అంశాలకు సంబంధించి తమనేతలతో ఎన్నో సార్లు సంప్రతించిన కేసీఆర్, పొత్తు కోసం తమ జాతీయనాయకత్వం ఫోన్ చేసినా స్పందించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆఖరు నిమిషంలో టీడీపీ అడ్డుపడినా, ఒక దశలో బీజేపీ కూడా అడ్డుపడే ప్రయత్నం చేసినా, సోనియా పట్టుదల వల్ల ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం చేస్తున్న తాము తెలంగాణ ఇచ్చారనే కారణంతో పొత్తు పెట్టుకున్నామన్నారు. పొత్తు ఎన్నికల వరకేనని, ఆతర్వాత ఎవరి దారి వారిదేనన్నారు.  కాంగ్రెస్‌తో  పొత్తు తమకు  బాధ కలిగిస్తోందన్నారు. ‘పలు దఫాల చర్చల అనంతరం పది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం ఇస్తామనిచెప్పి, ఏడు మాత్రమే ఇచ్చారు. అందులో ఒకదానికి దొడ్డి దారిన బీ-ఫారం అందజేశారు. పలు చోట్ల కాంగ్రెస్‌కు చెందిన నేతలే రెబెల్‌గా బరిలో దిగడం బాధిస్తోంది’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement