నా బిడ్డను చంపేశాడు....
- టీడీపీ ఎన్నికల ప్రచారంలో వైద్యుడు
- పట్టించుకోకపోవడంతో పాప మృతి
- చనిపోయిందని తెలిసి కేస్‌షీటు లాక్కున్నారు!
గుడివాడ, న్యూస్‌లైన్ : ‘ఆయన తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో పడి నా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు... కడుపు నొప్పని వస్తే రకరకాల పరీక్షలు చేయించి నర్సులు కాంపౌండర్లతో ైవె ద్యం చేయించి చివరికి బలి తీసుకున్నారు... వీళ్లకి నా ఉసురు తగలకపోదు..’ అంటూ ఆ తల్లి భోరున విలపించింది. అదేమని అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోండని తమను బయటకు తోసేశారని ఆవేదన చెందారు. మంగళవారం సాయంత్రం స్థానిక మాగంటి పిల్లల వైద్యశాలలో 13నెలల పాప మృతి చెందింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు.
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి...
టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మాగంటి పిల్లల వైద్యశాల వైద్యుడు డాక్టర్ మాగంటి శ్రీనివాసరావు ఆపార్టీ ఎన్నికల ప్రచారంలో గుడివాడలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల ఆయన నిర్లక్ష్యం వహించిన కారణంగా అభంశుభం ఎరుగని పసిపాప మృత్యువాత పడింది. గుడివాడ పట్టణంలోని పామర్రు రోడ్డు పెద్దకాలువ సాయిబాబాగుడి సమీపంలో ఉండే జగడం పూర్ణచంద్రరావు, పావనీల 13 నెలల కుమార్తె తేజశ్రీ (అమ్ములు) కడుపునెప్పితో బాధపడుతుండడంతో మాగంటి పిల్లల వైద్యశాలకు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి రాగా 12 గంటల సమయంలో డాక్టర్ తమ బిడ్డను చూశాడని చెప్పారు. అనంతరం ఎక్సరే, రక్తపరీక్షలు చేయించారని, ఆ తరువాత డాక్టర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాడని పాప తల్లి పావని పేర్కొంది. తమ బిడ్డ డొక్కలు ఎగరేస్తుందని ఎన్నిసార్లు చెప్పినా కేవలం నర్సులు మాత్రమే వచ్చి చూసి వెళ్లారని అదేమని అడిగితే మీకు తెలుసా?.. మాకు తెలుసా? అని తమపై విరుచుకుపడ్డారని అన్నారు. అంతా బాగానే ఉందని మాకు చెప్పారని, సాయంత్రం 4 గంటల సమయంలో వచ్చి నీ కూతురు చనిపోయింది. బిల్లు కట్టి వెళ్లిపోండని నర్సులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కేస్‌షీట్‌ను బలవంతంగా మావద్ద నుంచి లాక్కుని నీదిక్కున్న చోట చెప్పుకోమని అన్నారని విలేకరుల వద్ద వాపోయారు.
బంధువుల ఆందోళన...
విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరకుని ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులు వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవిషయం తెలిసిన వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు అక్కడికి చేరుకుని పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా వైద్యులు మాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ పాపకు వైద్యం అందించే విషయంలో తన నిర్లక్ష్యం లేదని, వ్యాధి తీవ్రత కారణంగానే పాప మృతి చెందిందని వివరించారు.
పాప ప్రాణం ఖరీదు రూ.లక్ష...
చనిపోయిన పాప ప్రాణం ఖరీదుగా రూ.లక్ష ఇచ్చేట్లు బంధువుల పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. అయితే పాప అనారోగ్యంతో చనిపోయిందని రాజీ పత్రాలపై సంతకాలు చేయించుకుని డబ్బు చెల్లించినట్లు మధ్య వర్తులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.