'అవమానాలు తట్టుకోలేకే పార్టీ మారుతున్నా'
విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచలి రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు తట్టుకోలేకే టీడీపీలో చేరుతున్నట్టు అంతకుముందు యలమంచలి రవి తెలిపారు. చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగాలని అనుకున్నా, కొందరి స్వార్థ రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌ను వీడవలసి వస్తోందని ‘సాక్షి’కి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో అవమానాలే తప్ప సముచిత గౌరవం కూడా దక్కలేదన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో జరిగిన అన్యాయంతో మనస్తాపం చెంది టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీలో చేరాలనుకున్నా, కార్యకర్తల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని చిరంజీవి, బొత్సతో మాట్లాడినా పట్టించుకోలేదన్నారు.