సబ్బం హరి తీరుతో కంగుతిన్న సీపీఎం
విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యలపై సీపీఎం శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమతో పొత్తు పెట్టుకొని బీజేపీ-టీడీపీకి ఓట్లేయమని ఎలా చెబుతున్నారని మండిపడ్డాయి. సమైక్యవాదానికి సబ్బంహరి తూట్లు పొడిచారని విమర్శించాయి.
సమైక్యాంధ్రకు కట్టుబడిన సీపీఎం... కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీతో సీమాంధ్రలో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన సబ్బం హరికి సీపీఎం మద్దతు పలికింది. అయితే చివరి నిమిషంలో సబ్బం హరి చేతులెత్తేయడంతో సీపీఎం శ్రేణులు కంగుతిన్నాయి.
పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చివరి నిమిషంలో సబ్బం హరి ప్రకటించడంతో ఆయనపై సీపీఎం శ్రేణులు కారాలు మిరియాలు నూరతున్నాయి. పిరికివాడిలా పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా, ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అడిగే అధికారం ఆయనకెక్కడిదని ప్రశ్నిస్తున్నాయి. అసలు ఎవరినడిగి పోటీ నుంచి తప్పుకున్నారని నిలదీస్తున్నాయి.