నితీష్ నిర్ణయమే ఇక ఫైనల్: శరద్ యాదవ్
బీహార్లో రాజకీయ డ్రామా రసవత్తరంగా మారుతోంది. రాజీనామా చేయాలన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయం ఫైనల్ అని జేడీయూ అధినేత శరద్ యాదవ్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఆయనను రాజీనామా చేయొద్దని, ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ఒకవైపు ఆ డ్రామా అలా జరుగుతుండగానే జేడీయూ అధినేత ఉన్నట్టుండి ఇలా ప్రకటించడంతో అక్కడి రాజకీయం కొత్త మలుపు తిరిగింది.
తన రాజీనామాపై నిర్ణయం తీసుకోడానికి సోమవారం వరకు గడువు ఇవ్వాలని నితీష్ కోరడంతో.. సోమవారం లెజిస్టేచర్ పార్టీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇంతలోనే శరద్ యాదవ్ ఈ బాంబు పేల్చడంతో నితీష్ ఉంటారా.. వెళ్లిపోతారా అన్న విషయంలో సరికొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నితీష్ తన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని అది చాలా కష్టమైనదే అయినా ఇక అదే తుది నిర్ణయమని శరద్ యాదవ్ చెప్పారు.