ఆ సత్తా జగన్ సొంతం
కరప, న్యూస్‌లైన్ : రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరికే ఉందని ఆపార్టీ కాకినాడ పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. కరప మార్కెట్ సెంటర్‌లో ఆదివారం షర్మిల వైఎస్సార్ జనభేరి సభలో సునీల్ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఈ మూడు రోజులూ ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా, రాజన్న రాజ్యం రావాలన్నా, వైఎస్సార్ రుణం తీర్చుకోవాలన్నా వైఎస్సార్‌సీపీని గెలిపించాలన్నారు.
25మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులు అధికంగా సాధించుకోగలమన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే యువతకు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. వృద్ధులకు రూ.200 నుంచి రూ. 700కు, వికలాంగులకు రూ.వెయ్యికి పింఛన్ పెంచుతారన్నారు. అమ్మఒడి తదితర పథకాలను గురించి వివరించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పార్లమెంటు అభ్యర్ధిగా తనను, కాకినాడరూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణను గెలిపించాలని అభ్యర్థించారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ షర్మిల 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసినవిషయాన్ని జనం హర్షధ్వానాల మధ్య గుర్తుచేశారు. ఈఎన్నికలు వంచనకు, విశ్వసనీయతకూ మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించారు. ప్రజాసమస్యలపై నాలుగున్నర ఏళ్లుగా పోరాటం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించడానికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తనతోపాటు పార్లమెంట్ అభ్యర్థి సునీల్‌ను గెలిపించాలని చెల్లుబోయిన కోరారు.