
ఎన్నికలు దాటాక.. వంతెన మరిచారు!
మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ను ఎమ్మెల్యేను చేసిన శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని గారన్నాయుడుపేట-పనసపేట గ్రామాల ప్రజల అవస్థకు తార్కాణం ఈ చిత్రం. 2009 ఎన్నికల సమయంలో మురళీమోహన్ ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు.. కాలువపై చిన్నపాటి వంతెన నిర్మిస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయని ప్రజలు మొరపెట్టుకున్నారు.
అదెంత పని ఓట్లేసి గెలిపిస్తే చేయించేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ప్రజల ఓట్లతో గెలిచారు. మంత్రి పదవీ చేపట్టారు. కానీ వారికి ఇచ్చిన హామీ మరిచిపోయూరు. ఐదేళ్లు గడిచినా.. సమస్య మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ ప్రమాదకరమైన చెక్కబల్లల వంతెన ఆధారంగానే ప్రజలు కాలువను దాటుతున్నారు. అయితే మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్న కోండ్రుకు ఈసారి అదే ఓటుతో బుద్ధి చెప్పేందుకు స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు.
- న్యూస్‌లైన్, సంతకవిటి, (శ్రీకాకుళం జిల్లా)