ధన ప్రవాహం
- బయటపడుతున్న అక్రమ నగదు, మద్యం
- పోలీసుల తనిఖీల్లో రూ.1.32 కోట్లు స్వాధీనం
- 43,919 మద్యం బాటిళ్లు సీజ్
- 26 కిలోల వెండి, 901 చీరలు కూడా
- తనిఖీలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా ఉంది. కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయి. మద్యం పారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన త నిఖీల్లో రూ.1.32 కోట్లకు పైగా నగ దును అక్రమంగా తరలిస్తుం డగా పోలీసు, ఇతర తనిఖీ బృందాలు పట్టుకున్నాయి. 43,919 మద్యం బాటిళ్లను సీజ్ చేశాయి. ఇంత భారీ స్థాయి లో డబ్బు, మద్యం దొరకడం.. అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. ధన ప్రవాహాన్ని అడ్డుకొనేందుకు జిల్లా యంత్రాంగం 52 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఒక్కో నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, మూడు స్టాటిక్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కొంత మంది డబ్బు, మద్యం తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.
భీమిలిలో అధికం : నగరంలోనే కాకుండా గ్రామాల్లో కూడా భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోంది. అందుకు తనిఖీ బృందాలకు దొరికిన డబ్బు, మద్యంమే నిదర్శనం. ప్రధానంగా భీమిలి నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా రూ.31,90,355, 1245 మద్యం బాటిళ్లు దొరికాయి. ఇక్కడ ఊడు కార్డు, 13 ఆటోలు, 2 వ్యాన్లు, ఒక మోటర్ సైకిల్, ఒక టాటా ఏస్‌లను స్వాధీనం చేసుకొని 21 మందిపై కేసులు పెట్టారు. అలాగే యలమంచిలిలో రూ.25,58,990 నగదు, 2072 మద్యం బాటిళ్లతో పాటు 109 చీరలను అధికారులు స్వాధీనం చేసుకొని 49 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అనకాపల్లిలో రూ.25,27,950 నగదు, 2029 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోగా ఒక బొలెరో, 3 స్కార్పియోలు, 5 కార్లు, ఒక ఆటో, ఒక మోటర్ సైకిల్‌ను సీజ్ చేశారు.
నర్సీపట్నంలో రూ.15,31,790 నగదు, 5804 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. పెందుర్తిలో నిర్వహించిన తనిఖీల్లో డబ్బు దొరకకపోయినప్పటికీ 26 కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భారీగా డబ్బు, మద్యం, చీరలు, జాకెట్లు, బయటపడింది. మొత్తంగా రూ.కోటి 32 లక్షల 20 వేల 4 వందలు నగదు, 43,919 మద్యం బాటిళ్లు, 26 కిలోల వెండి, 901 చీరలు, 110 జాకెట్లు, 20 టవళ్లు, 30 స్టీల్ బేసిన్లు, 6 సెల్‌ఫోన్లు, 86 మోడల్ బ్యాలెట్ పేపర్లు పట్టుకోగా 15 కార్లు, 14 జీపులు, 1 బొలెరో, 40 ఆటోలు, 22 మోటర్ సైకిళ్లు, ఒక మోపెడ్, ఒక బార్‌వెల్ లారీ, ఒక లారీ, 5 వ్యాన్లు, 2 టాటా ఏస్‌లు, 3 స్కార్పియోలను అధికారులు సీజ్ చేశారు. 382 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు
భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవుతున్నాయి. ఏజెన్సీలోనే కాకుండా మైదాన ప్రాంతాల్లో కూడా పేలుగు పదార్థాలు దొరుకుతుండడం అధికారులను కలవరపెడుతోంది. అరకులో నిర్వహించిన తనిఖీల్లో 60 కేజీల అమ్మోనియం సల్ఫేట్‌ను అధికారులు గుర్తించారు. అలాగే అనకాపల్లిలో తరలిస్తున్న 447 జిలటిన్ స్టిక్స్, ఒక ఎలక్ట్రికల్ డిటోనేటర్, ఒక బ్యాటరీ, 2 వైర్ బండిల్స్‌ను అధికారులు పట్టుకున్నారు. యలమంచిలిలో నిర్వహించిన తనిఖీల్లో 5 కిలోల సూరేకారం, కేజీ బొగ్గు, 30 రాకెట్లు దొరికాయి. దీంతో తనిఖీ బృందాలను మరింత విస్తరించి నిశితంగా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయిస్తున్నారు.