పవన్ సభకు ‘ఫ్యాక్టరీ’ మహిళలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఒంగోలులో ఆదివారం సాయంత్రం జరిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు సింగరాయకొండలోని మాగుంటకు చెందిన ఫ్యాక్టరీ మహిళలను తరలించారు. మహిళల మద్దతు ఉందని చూపించేందుకు టీడీపీ నాయకులు పడరానిపాట్లు పడ్డారు.
టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంటు నియోజకర్గం నుంచి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి సింగరాయకొండలో ఫ్యాక్టరీ ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అందులో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ప్రత్యేక వాహనంలో ఒంగోలు తరలించారు. పవన్‌కళ్యాణ్ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ కార్యకర్తలను ఒంగోలు తరలించారు.
నగదు, మందు, పెట్రోల్
పవన్‌కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒంగోలులోని నెల్లూరు బస్టాండుకు సమీపాన ఉన్న పెట్రోల్ బంకులో మోటార్‌సైకిళ్లకు ఉచితంగా పెట్రోల్ కొట్టించారు. మోటారుసైకిళ్లకు జనసేన, తెలుగుదేశం పార్టీల జెండాలు కట్టి నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో హడావిడి చేయించారు.
మైక్ మొరాయింపుతో అసహనం
ఏబీఎం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మైక్‌లు మొరాయించడంతో పవన్‌కళ్యాణ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన ప్రసంగించడం మొదలు పెట్టగానే మైక్‌లు సరిగా లేకపోవడంతో ఒకటికి రెండుసార్లు వాటిని మార్చారు. అయినప్పటికీ అవి అలాగే ఉండటంతో ఒకానొక దశలో పవన్‌కళ్యాణ్ తనకు సమీపంలో వేదికపై ఉన్న స్పీకర్లను అటూఇటూ స్వయంగా కదిలించారు. ఒంగోలుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
నల్లజెండాలతో నిరసన
పవన్‌కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నల్ల జెండాలతో నిరసన తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్‌కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసించారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని వారిని అక్కడ నుంచి బయటకు పంపించేశారు.
టీడీపీకి ఝలక్..
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్‌కళ్యాణ్ ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని జనసేన పార్టీ వ్యక్తని సభాముఖంగా వ్యాఖ్యానించారు. అంతలోనే ఆయన నాలుక్కరుచుకుని సరదాగా అన్నాను.. తెలుగుదేశం క్యాడర్ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొనడం విశేషం. సభా వేదిక నుంచి పవన్‌కళ్యాణ్ దిగే సమయంలో పట్టుతప్పి కిందపడబోయారు.
నేటితో ప్రచారం సమాప్తం
ఒంగోలు, న్యూస్‌లైన్ : రెండు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ కొన్నిరోజుల్లో తుది ఘట్టానికి చేరుకోబోతోంది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వానికి తెరపడనుంది.
రెండు నెలలకుపైగా విస్తృత ప్రచారం
వరుస ఎన్నికలు వైఎస్సార్‌సీపీకి బాగా కలిసి వచ్చాయి. మార్చి 3వ తేదీ ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చిన సంగతి విదితమే. వెనువెంటనే సాధారణ ఎన్నికల షెడ్యూలు, మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూలు కూడా రిలీజైంది. దీంతో పూర్తిస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రణరంగంలోకి దిగారు. పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ చేసిన బాలినేని ప్రచారం కూడా వైఎస్సార్‌సీపీ జిల్లాలో బలపడడానికి కారణంగా నిలిచింది. వీటన్నింటికి తోడు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని అంశాలు పార్టీపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడానికి కారణంగా నిలిచాయి.
మద్యం, డబ్బు పంపిణీపై ఆధారపడిన టీడీపీ
జిల్లాలో వైఎస్సార్‌సీపీ గాలి బలంగా వీస్తుండడంతో టీడీపీ అభ్యర్థులు డబ్బు, మద్యాన్ని నమ్ముకుని ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటును రూ.500 నుంచి రూ.3,500 మధ్య కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం.
కనిపించని విశ్వాసం
జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తున్నా ఆదరణ మాత్రం కనిపించడంలేదు. ఆదివారం ఏబీఎం కాంపౌండ్‌లో జరిగిన బహిరంగ సభను పరిశీలిస్తే పరిస్థితి అర్థం అవుతుంది. చంద్రబాబు గుట్టు లోకానికి ఎరుకైనా.. అబ్బే ఆయనకు మచ్చే లేదంటూ పవన్‌కళ్యాణ్ నమ్మించే యత్నం చేయడంతో ఆయనకు ఉన్న ఇమేజ్ కూడా ఒక్కసారిగా పడిపోయిందని మేథావులు విశ్లేషిస్తున్నారు.