ఆ దారి..రహదారి కాదు. ప్రయాణాలకు ప్రమాద కారి. అనుక్షణం గుండెలు చిక్కబెట్టుకొని వాహనాలను నడిపించాల్సిందే. ఇక పాదచారులకు నిత్య గండమే. రాక పోకల్లో ఎవరు అప్రమత్తంగా లేకున్నా..కాలుని పిలుపు అందుకోవాల్సిందే. రాత్రి వేళ..అదీ అమావాస్య నిశిలో అయితే ఆ మార్గంలో వెళ్లడం మరీ ఇబ్బందికరమే. వీటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ‘ఫోర్‌వే’ పనులు వేగమందుకున్నాయి. ప్రారంభించినంత వేగంగా అవి సాగితే మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్ రూటుకు మహర్దశ పట్టినట్లే. ఇన్నేళ్లుగా పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టినట్టే.
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ నుంచి భూత్పూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులను టెండర్ల ద్వారా ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. గత నెల మార్చి మొదటి వారంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల నుండి ఈ పనులు ఊపందుకున్నాయి. జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ స్టేజీ వద్ద నుంచి భూత్పూర్ వరకు 7.4 కిలోమీటర్ల మేర పనులు జరగనున్నాయి. వీటిని రూ.19 కోట్ల నిధులతో చేపడుతున్నారు. కాగా బాలాజీనగర్ నుంచి క్రిష్టియన్ పల్లి క్రీస్తుజ్యోతి పాఠశాల వరకు 5.85 కోట్లకు పనులు దక్కించుకున్న ‘అమ్మ కనస్ట్రక్షన్స్’ కంపెనీ ఇప్పటికే పనులను ప్రారంభించింది. రోడ్డుకు ఇరువైపుల రోడ్డు పనులను ప్రారంభించారు. అంతేకాకుండా కల్వర్టు నిర్మాణాలను ప్రారంభించింది.
చెట్ల తొలగింపు ముమ్మరం
మహబూబ్‌నగర్ నుండి భూత్పూర్ వర కు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల తొల గింపు చివరి దశకు చేరింది. ఈ పనులూ ముమ్మరం చేశారు. రోడ్డుకు ఇరువైపులా అధికసంఖ్యలో ఉన్న చెట్లను తొలగించా రు. ఇంకో మూడునాలుగురోజుల్లో చెట్ల తొలగింపు పూర్త్యై అవకాశం ఉంది.
రోడ్డు వెడల్పు ఇలా....
ప్రస్తుతం ఉన్న రోడ్డు మధ్యభాగం నుంచీ ఇరువైపులా 50 అడుగుల మేర విస్తరించనున్నారు. రోడ్డు మధ్యలో నాలుగు అడుగుల డివైడర్‌ను నిర్మించనున్నారు. అక్కడినుంచి ఇరువైపులా 32 అడుగుల మేర రహదారి వేస్తారు. మిగతా స్థలంలో కొంత భాగం మురుగునీటి కాలువల నిర్మాణానికి వినియోగించనున్నారు. కొం త స్థలం బాటసారులకోసం ఉంచుతారు.
రామన్‌పాడ్ పైపులైన్ మార్పులేనట్టే
రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భూత్పూర్ నుంచి మహబూబ్‌నగర్‌కు విస్తరించి ఉన్న రామన్‌పాడ్ పైపులైన్‌ను పునరుద్ధరించాలని తొలుత భావించినా కొన్ని కారణాల వల్ల వాటి జోలికి పోకుండా పనులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రామన్‌పాడు పైపులైనుకు తాకకుండా పనులు చేయనున్నారు. అవసరమైతే పైపులైన్‌కు తాకకుండా రోడ్డుకు ఎడమ భాగాన ఎక్కువ స్థలం తీసుకొని పనులు చేపడ్తారు.
విద్యుత్ స్తంభాల తొలగింపు
కాస్త ఆలస్యమే...
రోడ్డకు ఇరువైపుల ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడంతో అవి రోడ్డు విస్తరణ పనులకు ప్రధాన అడ్డంకిగా మారాయి.ఇప్పటి వరకు విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇప్పటి వరకు టెండర్లను వేయలేక పోయారు. దీంతో విద్యుత్ పునరుద్దరణ పనులు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ ఉండడంతో ఇప్పటికిప్పుడు టెండర్లు వేయలేని పరిస్థితి. ఎన్నికల అనంతరం టెండర్లు వేసే అవకాశం ఉంది. అప్పటి వరకు రోడ్డు పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.
వేగంగా... ‘ఫోర్‌వే’
Published Fri, Apr 18 2014 2:46 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement