భైంసా, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ మొదటి చైర్మన్ రంగారావు పల్సికర్. కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన ఆయనను సమితి అధ్యక్షులు చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. జిల్లా ఆవిర్భావం 1959 నుంచి ఇప్పటి వరకు జెడ్పీ చైర్‌పర్సన్‌ల ఎన్నిక జరుగుతోంది. 1987లో జెడ్పీ చైర్మ న్ ఎన్నిక తొలిసారిగా ప్రత్యక్ష పద్ధతిలో జరిగింది. 1987లో మండల వ్యవస్థ ఏర్పడకముందు సమితి అధ్యక్షులు జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేవారు.
అప్పట్లో సర్పంచులు సమితి అధ్యక్షులను ఎన్నుకునే పద్ధతి ఉండేది. ప్రతి తాలూకాలో ఇద్దరు సమితి అధ్యక్షులు ఉండేవారు. అప్పట్లో జిల్లాలో తొమ్మిది తాలుకాల పరిధిలో 18 మంది సమితి అధ్యక్షులు, వీరు ఎన్నుకునే ఆరు కో ఆప్షన్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేవారు. మొదటి చైర్‌పర్సన్‌గా పల్సికర్ రంగారావు 29-11-1959 నుంచి 26-1-1960వరకు ఒక పర్యాయం, 29-05-1961 నుంచి 10-9-1964 వరకు రెండో పర్యాయం జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో...
జిల్లాలో జెడ్పీ చైర్మన్‌కు ప్రత్యక్ష ఎన్నికలు 1987లో ఒక్కసారే జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గెలుపొందారు. అప్ప ట్లో మండల అధ్యక్షుల ఎన్నికలు ప్రత్యక్షంగానే జరిగాయి. ఆ తర్వాత నుంచి అన్ని పరోక్ష ఎన్నికలతోనే జెడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటున్నారు.
ఊరిపేరే ఇంటిపేరు..
మహారాష్ట్ర సరిహద్దులోని పల్సి గ్రామానికి చెందిన రంగరావు చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు గ్రామానికి ఎంతోమంది వచ్చేవారు. మహారాష్ట్ర వాసులకు పెద్దమొత్తంలో ఇక్కడి వారితో వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉండేవి. వ్యాపార లావాదేవీలతోపాటు బంధుత్వాలు మెండుగానే ఉండేవి. అలా రంగారావుకు ఊరిపేరే ఇంటి పేరుగా మారింది.. రంగారావు పల్సికర్ అని పిలిచేవారు.
‘మహా’ మాజీ సీఎం పల్సి అల్లుడే..
రంగారావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పుష్పకు కుమార్తె, రెండో భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలికి విలాస్‌రావు దేవ్‌ముఖతో వివాహం జరిపించారు. ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రంగారావు మరణించినప్పుడు పెద్దకర్మ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న విలాస్‌రావు దేశ్‌ముఖ్ పల్సికి వచ్చి వెళ్లారు. విలాస్‌రావు కుమారుడు, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ వివాహం 2012 ఫిబ్రవరిలో నటి జెనీలియాతో జరిగింది. ఆ జంటను ఆశీర్వదించేందుకు అప్పట్లో ఈ ప్రాంత వాసులకు ఆహ్వానం అందింది.
వైఎస్సార్ చొరవతో..
రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా దివంగత ముఖ్యమం త్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవ చూపారు. భైంసా మండలంలో వాడి గ్రామం వద్ద సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు రంగారావు పల్సికర్ ప్రాజెక్టుగా నామకరణం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
మొదటి జెడ్పీ చైర్మన్ రంగారావు
Published Wed, Mar 26 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement