నరసరావుపేట టౌన్, న్యూస్‌లైన్
గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పది మునిసిపాలిటీల ఎన్నికలకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ చెప్పారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నేర ప్రవృత్తి గలవారు ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడితే జిల్లా నుంచి బహిష్కరిస్తామని, అక్రమంగా మద్యం, నగదు రవాణా జరగకుండా చెక్‌పోస్టుల వద్ద నిరంతరం నిఘా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా ప్రజల్లో నమ్మకం కలిగించామన్నారు.
35 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, మరో తొమ్మిది ప్రాంతాల్లో బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలూ మూడు షిఫ్ట్‌ల ప్రకారం సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. చెక్‌పోస్టుల తనిఖీల్లో ఇప్పటి వరకు ఒక కోటి 25 లక్షల 91 వేల రూపాయల నగదు, 43 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని ఇన్‌కంట్యాక్స్ అధికారులకు అప్పగించామన్నారు. 34 బెల్టుషాపులపై కేసులు నమోదు చేసి 2,327 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కింద 20 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, 10 ఆటోలు, ఒక జీపును సీజ్ చేశామని రూరల్ ఎస్పీ తెలిపారు. 20 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి నాకాబందీ నిర్వహిస్తున్నామన్నారు. గత ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన, ఘర్షణలను ప్రోత్సహించేవారి ఆస్తులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.
దొంగ ఓట్లను అరికట్టే చర్యల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో గ్రామాల నుంచి కారణం లేకుండా వ్యక్తులు రాకుండా దిగ్బంధం చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా రూరల్ ఎస్పీ
నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల పరిధిలోని పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి వినుకొండ రోడ్డులోని పెట్లూరివారిపాలెం సమీపంలోని ఏఎం రెడ్డి కళాశాలలో ఏర్పాటుచేసే కౌంటింగ్ కేంద్రాన్ని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ.. డీఎస్పీ డి.ప్రసాద్, ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు.
మునిసిపల్ ఓట్ల కౌంటింగ్‌కు ఏఎం రెడ్డి కళాశాల అనువైనదిగా రెవెన్యూ అధికారులు భావించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని భద్రతాఏర్పాట్లలో భాగంగా పరిశీలించి తగు సూచనలు చేసినట్లు రూరల్ ఎస్పీ సత్యనారాయణ చెప్పారు.