తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇంటికి పంపిస్తామని జేసీ టి.బాబూరావునాయుడు హెచ్చరించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎన్నికల నియమావళిపై అధికారులు, పోటీ చేసే అభ్యర్థులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చే పెయిడ్ న్యూస్‌పై నిఘా ఉంచిందన్నారు. 2010లో బీహార్ ఎన్నికల సందర్భంగా ఈ తరహా వార్తలపై నియంత్రణ చట్టాన్ని ఎన్నికల సంఘం వర్తింపచేసిందన్నారు. ఇదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికే షన్ మోనటరింగ్ కమిటీలను నియమించినట్టు తెలిపారు.
ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న పార్టీలు సంబంధిత ప్రభుత్వ కమిటీల అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే 171 (హెచ్) ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు మీడియాలో సమంగా ప్రచారం కల్పించాలని సూచించారు. ఘర్షణలు, డబ్బు పంపకాలు అధికంగా ఉండే ప్రాంతాలపై నిఘా ఉంచామన్నారు.
అదనపు జేసీ సీహెచ్ నరసింహారావు, ఆర్డీవో బి.శ్రీనివాసరావు, కమిషనర్ పి.నిరంజనరెడ్డి, డీఎస్‌పీ వి.రాజగోపాల్, టీపిఓ ఎం.సత్యనారాయణ, రిటర్నింగ్ అధికారి ఉమారాణి, పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి, ఎక్సైజ్ సీఐ సాయి స్వరూప్ పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళిని
పాటించని అభ్యర్థులపై చర్యలు
నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించకపోతే చర్యలు తీసుకుంటామని జేసీ టి.బాబూరావునాయుడు అన్నారు. నరసాపురంలో మునిసిపల్ అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలను పాటించని అభ్యర్థులపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులపై 24 గంటలు నిఘా ఉంటుందని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయరాదన్నారు. ప్రచారానికి అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను ప్రచారానికి వినియోగించరాదన్నారు. అభ్యర్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు.
అనంతరం నిజాయితీగా ఓటేస్తామని డ్వాక్రా మహిళలతో జేసీ ప్రతిజ్ఞ చేయించారు. నీతి నిజాయితీగా ఓటువేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. బ్రోచర్లను ఆవిష్కరించారు. ఆర్డీవో జె.ఉదయ భాస్కరరావు, డీఎస్పీ రఘువీరారెడ్డి, తహసిల్దార్ రమేష్, మునిసిపల్ కమిషనర్ పీసీ విజయకుమార్, పార్టీ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.
నిబంధనలు మీరితే ఇంటికే
Published Sat, Mar 22 2014 12:31 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM