
నిస్వార్థ సేవకు స్ఫూర్తి గజ్వేల్ సైదయ్య
ఇరవైయేళ్లపాటు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు...నిస్వార్థంగా ప్రజా సేవకు శ్రమించారు..నిరాడంబరంగా రాజకీయ జీవితం సాగించారు.. ఎమ్మెల్యేగా ఉన్నా ఆర్టీసీ బస్సులోనే తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడేవారు...పలు పదవులు చేపట్టినా వ్యక్తిగత ప్రతిష్ట కోసం, సంపాదన కోసం పాకులాడకుండా ఆదర్శమైన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఆయనే గజ్వేల్ సైదయ్య.
సైదయ్య మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన దళిత నేత. గజ్వేల్ మండలం కొడకండ్ల సైదయ్య స్వగ్రామం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టారు. అక్కడే దొరల వద్ద జీతం చేసేవాడు. నిజాయితీగా వ్యవహరించే సైదయ్య మీద దొరలకు గురి ఉండేది. 1962లో గజ్వేల్ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అయ్యింది. కొడకండ్ల గ్రామానికే చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాదాడి రంగారెడ్డి చొరవ తీసుకుని సైదయ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు. తొలి ప్రయత్నం లోనే విజయం సాధించిన సైదయ్య రంగారెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగారు. 1967, 1972, 1978 లలో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి ప్రజలకు సేవలందించారు. ఆర్టీసీ బస్సుల్లోనే ఊళ్లన్నీ తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేశారు.
నిరాడంబరంగా, చిత్తశుద్ధితో పనిచేసిన ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రశంసలు అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యునిగా, లిడ్‌క్యాప్ మెంబర్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. వ్యక్తిగత ప్రతిష్ట మీద, సంపాదన మీద ఏనాడు ధ్యాస పెట్టలేదు. ఫలితంగా చివరకు ఆయనకు మిగిలిం ది పెంకుటిల్లు మాత్రమే. బంజారాహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర హౌసింగ్ సోసైటీలో సైదయ్యకు ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. కొంతకాలం ఆ స్థలం ఆయన ఆధీనంలోనే ఉంది. తర్వాతేం జరిగిందో గానీ అది ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దాన్ని దక్కించుకోవడానికి సైదయ్య కుమారుడు కృష్ణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1996లో అనారోగ్యం తో కృష్ణ మరణించా డు. దాంతో ఆ కుటుంబం ఆకలి బాధలతో అలమటించింది. సైదయ్య కోడలు కమల కష్టాలను దిగమింగి కుమారులను, కుమార్తెను చదివించింది. ఐదేళ్లక్రితం సైదయ్య మనుమడు వెంకట్ కిరణ్‌కు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావటంతో వారికి ఊరట లభించింది. రెండో మనుమడు వేణుగోపాల్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మనుమరాలు కీర్తిక ఎంఎస్సీ, బీఎడ్ పూర్తి చేసింది. మూడో మనుమడు శైలేష్ జెఎన్‌టీయూలో ఎంటెక్ చదువుతున్నాడు.
మమ్ములను పట్టించుకునేటోళ్లు లేరు..
నా భర్త నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యి ఎన్నో మంచి పనులు జేసిండు. ఎందరో పెద్ద పెద్దోళ్లతో శభాష్ అనిపించుకుండు. నయాపైసా సంపాయించుకోలే. గిప్పుడు ఎంతో గోస పడుతున్నం. మమ్ములను పట్టించుకునేటోళ్లు లేరు. సర్కార్ ప్లాట్లచ్చినమని చెప్పింది. జాగాలిచ్చినమన్నది. కానీ ఎక్కడున్నయో తెల్వదు. ఏమయిపోయినయో తెల్వదు.
- సాయమ్మ, సైదయ్య సతీమణి