- కలవని టీడీపీ శ్రేణులు
- అట్టడుగు వర్గాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత
- మోడీ బహిరంగ సభపైనే ఆశలు
- అరుునా కష్టమేనంటున్న విశ్లేషకులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు ఆశలు గల్లంతవుతున్నారుు. ఎన్నికల ప్రచారానికి ఆయన తిరగలేక తిరుగుతున్నారు. అడుగడుగునా వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన ప్రభావం ఎక్కడా కనిపించడంలేదు. ప్రజలు సైతం ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. బీజేపీకి జనంలో ఏమాత్రం పట్టులేకపోవడంతో గంగరాజు ఆ పార్టీ అభ్యర్థి అనే విషయమే కొన్ని గ్రామాల్లో తెలియని పరిస్థితి నెలకొంది.
కలవని తెలుగుదేశం శ్రేణులు
పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీని దూరంగా పెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమకు తాముగానే ప్రచారం చేస్తున్నారు తప్ప ఎంపీ అభ్యర్థి ప్రస్తావన తీసుకురావడం లేదు. గంగరాజు కూడా వారికి దూరంగానే ఉంటున్నారు. ఒకవేళ కలిసినా కాసేపు మొక్కుబడిగా ప్రచారం చేసి ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారు. రాష్ట్రస్థాయిలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా ఇక్కడ మాత్రం అది కనిపించడం లేదు. బీజేపీ సీటు కేటాయించే సందర్భంలో అవలంభించిన వైఖరే దీనికి ప్రధాన కారణంగా కనబడుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ మాట చెల్లుబాటుకాకపోవడంతో ఆ పార్టీ నేతలంతా బీజేపీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి మధ్య కనీస సయోధ్య కూడా కనిపించడం లేదు. దీంతో గంగరాజు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన తన గ్రూపు సంస్థల ఉద్యోగులపైనే పూర్తిగా ఆధారపడ్డారు. ఆశ్రం కాలేజీ, డీఎన్‌ఆర్ కాలేజీతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల గల లైలా గ్రూపు సంస్థల ఉద్యోగులను దిగుమతి చేసుకుని గ్రామాల్లో తిప్పుతున్నారు. వారందరికీ ఈ ప్రాంతం కొత్త కావడం, ఎవరేమిటో తెలియకపోవడంతో అయోమయూనికి గురవుతున్నారు.
అట్టడుగు వర్గాల్లో వ్యతిరేకత
అట్టడుగు వర్గాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. దళిత వర్గం పూర్తిగా బీజేపీని వ్యతిరేకిస్తోంది. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఎస్సీల ఓట్లు అత్యంత కీలకం. వారంతా మతం ముద్ర ఉన్న బీజేపీ అంటే భయపడున్నారు. గణనీయంగా ఉన్న దళిత క్రిస్టియన్లు బీజేపీ అభ్యర్థి గంగరాజు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మైనార్టీలైతే బీజేపీ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే తమ పరిస్థితి దుర్భరంగా మారుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. మధ్యతరగతి ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నట్టు బీజేపీ భావిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాజశేఖరెడ్డి హయాంలో అమలైన పథకాల వల్ల లబ్ధిపొంది అనేక కుటుంబాలు నేటికీ ఆయనను ఆరాధిస్తున్నాయి. ఇవన్నీ గంగరాజుకు ప్రతికూలంగా మారాయి.
మోడీ సభపైనే ఆశలు
ఇలాంటి పరిస్థితుల నడుమ ఎన్నికల పోరులో బాగా వెనుకబడిన గంగరాజు మే 1వ తేదీన భీమవరంలో జరిగే నరేంద్ర మోడీ సభపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ సభ తర్వాత కొంతమార్పు వస్తుందేమోననే ఆశతో ఆయన వర్గం పనిచేస్తోంది. ఆ సభకు ఎలాగోలా జనాన్ని తీసుకొచ్చేందుకు హైరానా పడుతోంది. అయితే మోడీ వచ్చి సభ పెట్టినంత మాత్రాన అద్భుతం ఏమీ జరగదని టీడీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆయన సభ వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే తమకున్న ఒకేఒక్క అవకాశం మోడీ బహిరంగ సభేనని గంగరాజు వర్గం భావించి ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీ నాయకులు మాత్రం ఈ సభపైనా పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో సభకు జనం వస్తారో రారోననే భయం బీజేపీ నేతలను వేధిస్తోంది.