
అవంతి శ్రీనివాస్-గుడివాడ అమర్‌నాథ్
రాజకీయాలే చిత్రం అనుకుంటే, ఎన్నికలు మరీ విచిత్రంగా ఉంటాయి. ఎన్నికలలో ఎవరిమీద ఎవరైనా పోటీ చేస్తుంటారు.
రాజకీయాలే చిత్రం అనుకుంటే, ఎన్నికలు మరీ విచిత్రంగా ఉంటాయి. ఎన్నికలలో ఎవరిమీద ఎవరైనా పోటీ చేస్తుంటారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, బావబావమరుదులు, గురుశిష్యులు, స్నేహితులు, కొన్ని సందర్భాలలలో భార్యాభర్తలు కూడా ఒకరిపై ఒకరు పోటీపడుతుంటారు. రాజకీయ పార్టీలు - స్థాన బలం - అర్ధబలం - కుల బలం... ఇలా అనేక రకాల ప్రాతిపధికపై ఈ విధంగా ఒకే నియోజకవర్గంలో అయినవారు, ఆత్మీయులు, స్నేహితులు ఎన్నికల బరిలో నిలుస్తుంటారు. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో అది మరీ ఎక్కువ.
ఈ సారి ఎన్నికలలో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో గురు శిష్యులు పోటీపడుతున్నారు. చదువు విషయంలో వాళ్లిద్దరూ గురుశిష్యులైనా, ఇప్పుడు రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులయ్యారు. గురువుపైనే శిష్యుడు పోటీకి దిగాడు. ఆయనకంటే రెండాకులు ఎక్కువే చదివిన శిష్యుడు గురువుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. గురువు అవంతి శ్రీనివాస్ అయితే శిష్యుడు గుడివాడ అమర్‌నాథ్. వీరిద్దరి గురుశిష్య లింకేంటని అనుకుంటున్నారా? శ్రీనివాస్‌కు చెందిన అవంతి కాలేజీలోనే అమర్‌నాథ్ ఇంజినీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమర్‌నాథ్ వయసు 28 ఏళ్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. అతి చిన్న వయసులో లోక్‌సభకు పోటీ చేస్తున్న ఘనత దక్కించుకున్నారు. అవంతి శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున భీమిలి నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఈ మధ్యనే టిడిపిలో చేరారు. అనకాపల్లి లోక్సభ స్థానానికి ఆ పార్టీ టికెట్ సంపాదించి బరిలో నిలిచారు.
ఈ గురుశిష్యుల పోటీయే ఇప్పుడు అనకాపల్లిలో హాట్ టాపిక్. ఇప్పుడు శ్రీనివాస్ తనకు ప్రత్యర్థే అయినా, గతంలో తన గురువు కావడంతో నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా అమర్‌నాథ్ ఆయన ఆశీర్వాదం తీసుకొని అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ప్రచారంలో అమర్నాథ్ దూసుకెళ్తున్నాడు. యువకుడు, ఉన్నత చదువులు చదువుకున్నవాడు కావడంతో జనం కూడా అమర్‌ను ఆశీర్వదిస్తున్నారు. ప్రచారంలో శ్రీనివాస్‌ను పూర్తిగా వెనక్కినెట్టేశారు. దీంతో ఎన్నికల్లో గురువుకు చెమటలు పట్టించడం ఖాయమన్న అంచనాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, అవంతి శ్రీనివాస్ స్థానికేతరుడు కావడం అమర్‌నాథ్‌కు కలిసొచ్చింది. గుడివాడ వంశానికి అనకాపల్లిలో మంచి పేరుంది. అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు అనకాపల్లి లోక్సభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి. దివంగత మహానేత వైఎస్ఆర్ చోడవరం వద్ద కల్యాణీ డ్యామ్‌కు గుడివాడ గుర్నాథరావు డ్యామ్‌గా నామకరణం చేశారు. ఆ విధంగా అమర్నాథ్కు తండ్రి నుంచి సంక్రమించిన ప్రజాభిమానంతోపాటు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని రాష్ట్రమంతా కోరుకోవడం కూడా ఆయన విజయానికి పుష్కలంగా దోహదం చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.