హైడ్రామా! | Haidrama! | Sakshi
Sakshi News home page

హైడ్రామా!

Published Mon, Apr 7 2014 2:48 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

Haidrama!

సాక్షి ప్రతినిధి, అనంతపురం : పరిటాల సునీత రాజీనామాస్త్రం.. జేసీ దివాకర్‌రెడ్డి అల్టిమేటం.. బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు రంగప్రవేశంతో జిల్లాలో బీజేపీ-టీడీపీల మధ్య సీట్ల కేటాయింపు మళ్లీ మొదటికొచ్చింది. పొత్తులో భాగంగా కదిరిని బీజేపీకి కేటాయించాలని చంద్రబాబు భావించగా తన వర్గీయుడు, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు అన్యాయం చేస్తే రాజీనామా చేస్తానంటూ చంద్రబాబుకు పరిటాల సునీత స్పష్టీకరించారు.

ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన బాబు.. అనంతపురం శాసనసభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై జేసీ దివాకర్‌రెడ్డి భగ్గుమన్నారు. బీజేపీ ఉనికే లేని అనంతపురం శాసనసభ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయిస్తే.. లోక్‌సభ స్థానం నుంచి తాను పోటీచేయనని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.

 ఇదే సమయంలో బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని టీడీపీ ఎటూ ఓడిపోయే అనంతపురం స్థానాన్ని మాకు అంటగడితే ఎలా.. కదిరి స్థానాన్ని కచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. అనంతపురం జిల్లాలో సీట్ల కేటాయింపుపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సీమాంధ్రలో 15 శాసనసభ, 5 లోక్‌సభ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది.

జిల్లాలో కదిరి, అనంతపురం శాసనసభ స్థానాలను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు తొలి నుంచి పట్టుబడుతూ వస్తున్న విషయం విదితమే. కానీ.. జిల్లాలో ఒకే శాసనసభ స్థానం కేటాయించనున్న నేపథ్యంలో కదిరి ఒక్కటీ ఇస్తే చాలని తాజాగా బీజేపీ నేతలు పట్టుపట్టారు. కదిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారని.. అందువల్ల ఆ సీటు ఇవ్వలేమని, అనంతపురం సీటు ఇచ్చేందుకు సిద్ధమని బీజేపీ నేతలకు చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ.. ఆ ప్రతిపాదనలను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్ తోసిపుచ్చారు. 2009 ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్నప్పుడు సిటింగ్ ఎమ్మెల్యే ఉన్న ధర్మవరం స్థానాన్ని ఆ పార్టీకి ఎలా కేటాయించారంటూ నిలదీశారు. ఇప్పుడు అదే తరహాలోనే కదిరి కచ్చితంగా తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.

 పరిటాల సునీత రాజీనామాస్త్రం

 కదిరిలో కందికుంట ప్రసాద్‌కు అన్యాయం చేస్తే పార్టీని వీడటానికి వెనుకాడబోమంటూ చంద్రబాబుకు పరిటాల సునీత ఆదివారం మరోసారి స్పష్టీకరించారు. పరిటాల సునీతను అనునయించేందుకు చంద్రబాబు విఫలయత్నం చేశారు. తాము వారించినా జేసీ దివాకర్‌రెడ్డిని తీసుకున్నారని.. ఇప్పుడు కందికుంటకు అన్యాయం చేస్తే సహించమని పరిటాల సునీత హెచ్చరించడంతో చంద్రబాబు చేసేదిలేక అనంతపురం స్థానాన్నే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ఇది పసిగట్టిన జేసీ దివాకర్‌రెడ్డి ‘2009 ఎన్నికల్లో అనంతపురంలో బీజేపీ పోటీ చేస్తే కేవలం 800 ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఆ పార్టీ బలం పెరిగిన దాఖలాలు లేవు.. ఈ నేపథ్యంలో ఆ సీటును బీజేపీకి కేటాయించవద్ద’ని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు. అనంతపురం అసెంబ్లీ సీటును కేటాయిస్తే.. ఆ ప్రభావం లోక్‌సభ స్థానంపై పడుతుందని జేసీ వివరించారు. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా 1999 ఎన్నికల్లో కదిరిని ఆపార్టీకి కేటాయించారని.. అప్పట్లో బీజేపీ అభ్యర్థి ఎంఎస్ పార్థసారధి 7,236 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని చంద్రబాబుకు జేసీ వివరించారు.

 2004 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా ఎంఎస్ పార్థసారధి పోటీ చేశారని.. కందికుంట ప్రసాద్ టీడీపీ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగడం వల్లే ఎంఎస్ పార్థసారధి విజయం సాధించలేకపోయారని గణాంకాలతో సహా చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. బీజేపీ నేతలు కోరినట్లుగా కదిరిని ఆపార్టీకే కేటాయించడం సముచితమంటూ జేసీ స్పష్టీకరించారు. కాదూ కూడదని అనంతపురం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే.. తాను లోక్‌సభ స్థానానికి పోటీచేసే ప్రశ్నే లేదని జేసీ దివాకర్‌రెడ్డి అల్టిమేటం జారీచేసినట్లు టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

 వెంకయ్య రంగ ప్రవేశం

 టీడీపీ గెలవలేని అనంతపురం శాసనసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించిందనే అంశాన్ని బీజేవైం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురంలో విజయావకాశాలు తక్కువగా ఉంటాయని.. కదిరి శాసనసభ స్థానం ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని విష్ణువర్దన్‌రెడ్డి వివరించారు.

ఈ వాదనతో ఏకీభవించిన వెంకయ్యనాయుడు ఆదివారం రాత్రి నేరుగా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతపురం అసెంబ్లీ స్థానం తమకు వద్దని.. కదిరి సీటును కేటాయించాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. జేసీ దివాకర్‌రెడ్డి, వెంకయ్యనాయుడు ఒత్తిడితో చంద్రబాబు వెనక్కి తగ్గారు. జిల్లాలో సీట్ల కేటాయింపుపై ప్రత్యేక సమావేశం నిర్వహించి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement