కలిసిరాని ‘హోం’!
*రంగారెడ్డి జిల్లా నేతలకు అచ్చిరాని హోంమంత్రి పదవి
*క్రమక్రమంగా తగ్గుతున్న రాజకీయ ప్రాభవం
* ప్రభాకర్‌రెడ్డి నుంచి సబితారెడ్డి వరకూ ఇదే పరిస్థితి
‘హోం మినిస్టర్’ పదవి రంగారెడ్డి జిల్లా నేతలకు కలిసి రావట్లేదా.. ఈ శాఖలో కొనసాగిన మంత్రులు క్రమంగా కీలక పదవులకు దూరమవుతున్నారా.. క్రియాశీల రాజకీయాల్లో తమ ప్రాభవాన్ని కోల్పోతున్నారా..? అనే ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం అవుననిపిస్తోంది. ఇటీవలీ వరకూ జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పట్లోళ్ల సబితారెడ్డి నుంచి అలనాటి హోంమంత్రి ప్రభాకర్‌రెడ్డి దాకా ఒకసారి పరిశీలిస్తే పై ప్రశ్నలకు మరింత స్పష్టత కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణలు ఇవిగో..
తనయుడి కోసం సబిత త్యాగం
భర్త పి.ఇంద్రారెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన పట్లోళ్ల సబితారెడ్డి అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 2000 సంవత్సరంలో చేవెళ్ల ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొం దిన సబిత.. ఆ తర్వాత 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో గనులు, చేనేత, జౌళి శాఖ పదవులను ఆమె అధిష్టించారు. ఆ తర్వాత చేవెళ్ల ఎస్సీ రిజర్వ్ కావడంతో 2009లో మహేశ్వరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండోసారి వైఎస్ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు. వైఎస్సార్ తర్వాత కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లోనూ ఆమె హోంమంత్రిగా వ్యవహరించి ఉమ్మడి రాష్ట్రానికి చివరి హోంమంత్రిగా నిలిచిపోయారు. అయితే అవినీతి అభియోగాల నేపథ్యంలో సబితపై సీబీఐ కేసు నమోదు చేయడంతో 2013 ఏప్రిల్‌లో పదవికి రాజీనామా చేశారు.
అప్పట్నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న కోణంలో తనయుడు కార్తీక్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్ కేటాయించడంతో ఆమె పోటీ నుంచి అనివార్యంగా వైదొలగాల్సి వచ్చింది.
క్రియాశీల రాజకీయాలకు దేవేందర్ దూరం
రాష్ట్రంలో బలీయమైన బీసీ నేతగా ఎదిగిన దేవేందర్ గౌడ్.. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవితో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1994లో మేడ్చల్ శాసనసభకు పోటీ చేసి చంద్రబాబు మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1999 రెండోసారి ఎన్నికైన దేవేందర్.. చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆ తర్వాత మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అనూహ్యంగా టీడీపీ నుంచి బయటకొచ్చిన దేవేందర్.. నవతెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేస్తూ 2009లో ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇటు కొత్త సమీకరణాలు.. అటు అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దేవేందర్ దూరంగా ఉంటున్నారు.
టీడీపీని వీడిన ఇంద్రారెడ్డి
రాజకీయాల్లో చురుకైన వ్యక్తిగా పేరున్న పట్లోళ్ల ఇంద్రారెడ్డి 1985లో చేవెళ్ల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కార్మిక శాఖ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1994లో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇంద్రారెడ్డిని హోంశాఖ వరించింది.
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్లడంతో ఇంద్రారెడ్డి ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని చేవెళ్ల నుంచి 1999లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం ఏప్రిల్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు.
కందాడి ప్రభాకర్‌రెడ్డిదీ ఇదే పరిస్థితి..!
టి.అంజయ్య ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన కందాడి ప్రభాకర్‌రెడ్డి స్వస్థలం హయత్‌నగర్ మండలం కోహెడ గ్రామం. 1978లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి జనతాపార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1984లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పార్టీని వీడిన తర్వాత క్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.