‘అధికారాంతమ్మున చూడవలయు ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నాడో కవి. మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్థితిని చూస్తే ఆ కవి వాక్కు గుర్తుకు రాక మానదు. ఏ ఎన్నికల్లోనైనా కళకళలాడిన ఆ పార్టీ ఇప్పుడు పోటీదారులకే నోచుకోక వెలవెలబోతోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :గతంలో ప్రతి ఎన్నికలప్పుడూ టిక్కెట్ల కోసం కుమ్ములాటలు తప్పని కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సార్వత్రికపోరు బరిలో దిగే వారి కోసం దుర్భిణి వేసి వెతకాల్సి వస్తోంది. ‘టిక్కెట్ ఇస్తాం.. పోటీ చేయండి’ అని పిలిచి, అవకాశం ఇవ్వబోయినా.. ‘మాకొద్దు బాబోయ్’ అంటూ ముఖం చాటేస్తున్నారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి బతిమిలాడినా, బుజ్జగించినా టిక్కెట్టు వద్దంటూ తప్పించుకు తిరుగుతున్నారు. జిల్లాలో 19 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఒకప్పుడు కాంగ్రెస్ నేతలకు పెద్ద తలపోటుగా ఉండేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
సామాజిక న్యాయం నినాదంతో చిరంజీవి స్థాపించిన పీఆర్పీ తరఫున 2009 ఎన్నికల్లో జిల్లాలో కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, కొత్తపేట నియోజకవర్గాల నుంచి కురసాల కన్నబాబు, వంగా గీత, పంతం గాంధీమోహన్, బండారు సత్యానందరావు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆనక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారారు. వారిలో బండారు ముందుచూపుతో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరి టిక్కెట్టు తెచ్చుకున్నారు. కాగా మిగిలిన ఆ ముగ్గురినీ ఈ ఎన్నికల్లోనూ అవే స్థానాల నుంచి పోటీ చేయాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగినా డిపాజిట్ కూడా దక్కదనే ముందుచూపుతో గీత, పంతం చిరంజీవి మాటను బుట్టదాఖలు చేశారు. బరిలోకి దిగితే ఎంతలేదన్నా రెండు, మూడు కోట్లు ఖర్చు చేయక తప్పదని, ఎలాగూ ఓడే ముచ్చటకు అంత ఖర్చు ఎందుకని జంకాారు. తమను తొలిసారి ఎమ్మెల్యేలను చేసిన చిరంజీవి మాటను లెక్కలోకి తీసుకుంటే ఆర్థికంగా చితికిపోతామన్న భయంతో ససేమిరా అన్నారు.
కన్నబాబుకు ‘పళ్లంరాజు’ కళ్లెం..
చిరంజీవికి సన్నిహితుడైన కన్నబాబు కూడా తొలుత పోటీకి ఆసక్తి కనబరచలేదు. రెండు రోజుల క్రితం మనసు మార్చుకుని పోటీ చేద్దామని సిద్ధపడేసరికి సీను మారిపోయింది. కేంద్ర మంత్రి పళ్లంరాజు తన వారనుకున్న వారికి కాకినాడ రూరల్ సహా మిగిలిన నియోజకవర్గాలకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కాకినాడ రూరల్‌కు కేంద్ర మాజీ మంత్రి పీవీ రంగయ్యనాయుడు కుమారుడు సీతారామస్వామినాయుడుకు టిక్కెట్టు ఇప్పించడంతో కన్నబాబుకు స్వతంత్రునిగా బరిలోకి దిగక తప్పలేదు. అదేవిధంగా పళ్లంరాజు కాకినాడ కార్యాలయ వ్యవహారాలు చక్కబెట్టే పీఏ పంతం నెహ్రూ భార్య ఇందిరను పిఠాపురం, తన అనుండు శిష్యుడైన పంతం వెంకటేశ్వరరావుకు కాకినాడ సిటీ నియోజకవర్గం అభ్యర్థులుగా ప్రకటింపజేశారు. కాకినాడ సిటీ సీటు మత్స్యకార సామాజికవర్గానికి చెందిన బందన హరి వంటి వారికి ఇస్తారని ఆశలు పెంచుకున్నారు.
తీరా పళ్లంరాజు తన అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకోవడం ద్వారా ‘చింత చచ్చినా పులుపు చావలే’దన్న మాదిరిగా అడ్రస్ గల్లంతైపోయినా కాంగ్రెస్ పాత సంప్రదాయాన్ని విడిచిపెట్ట లేకపోతోందనే విషయం మరోసారి స్పష్టమైంది. కాగా పోటీకి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో పళ్లంరాజు పార్టీ కోసం ఆమాత్రం పనిచేయడంలో తప్పేమిటని అనుచరులు ప్రశ్నిస్తున్నారు.అనపర్తి, తుని, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ తరఫునప్రాతినిధ్యం వహించిన నల్లమిల్లి శేషారెడ్డి, రాజా అశోక్‌బాబు, పొన్నాడ సతీష్, రాపాక వరప్రసాద్ టిక్కెట్టు ఇస్తామన్నా పోటీ చేయమని చేతులెత్తేశారు. రాపాక బీజేపీలో చేరారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పి.గన్నవరం, రంపచోడవరంల నుంచి పాముల రాజేశ్వరీదేవి, కోసూరి కాశీ విశ్వనాథ్‌లు మాత్రమే తిరిగి పోటీకి తలూపారు.
‘చేతు’లెత్తేశారు...
Published Thu, Apr 17 2014 1:02 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement