అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం విశ్వసనీయతకు ఓటరు పట్టం కట్టాడు. నిజాయతీతో కూడిన రాజకీయాలనే ఆదరించాడు. అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుంటామని చాటుకున్నాడు. ఆపద సమయంలో అండగా నేనున్నానని భరోసానిస్తూ.. సంతోషంలో కుటుంబ సభ్యునిగా పాల్పంచుకుంటూ.. కష్టమొస్తే తన బాధగా భావించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బాసటగా నిలిచారు.
పార్టీ అభ్యర్థులను పట్టణ వాసులు మున్సిపాలిటీల్లో గెలిపించగా.. పల్లెల్లో గ్రామీణులు ప్రాదేశిక అభ్యర్థులకు పెద్దపీట వేశారు. నాలుగేళ్ల క్రితం పురుడు పోసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ ధాటికి వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ మట్టి కరువగా.. ద్వంద్వ నీతి కలిగిన 30 ఏళ్ల టీడీపీ కుదేలైంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహత విజయాలు నమోదు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీ.. ప్రాదేశిక పోరులోనూ పట్టు సాధించింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ముందు వెలువడిన ఈ ఫలితాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కలిగింది. జిల్లాలో మొత్తం 815 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 785 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. 378 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఇదివరకే ఏకగ్రీవమైన 19 స్థానాలను కలుపుకుంటే 397 ఎంపీటీసీ స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ ఖాతాలో చేరినట్లయింది. ఈ లెక్కన 22 మండల పరిషత్‌లో పార్టీ అభ్యర్థులు పాగా వేశారు.
టీడీపీ విషయానికొస్తే.. 334 ఎంపీటీసీ స్థానాలతో 19 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. మరో 11 మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. టీడీపీ విజయం సాధించిన స్థానాల్లో చాలా చోట్ల అత్యల్ప మెజార్టీతో గట్టెక్కడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ 43 స్థానాలకే పరిమితమైంది. ఈ పార్టీ అభ్యర్థులు సైతం అత్తెసరు మెజార్టీతోనే బయటపడగలిగారు. రాయలసీమ పరిరక్షణ సమితి పగిడ్యాల మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. 33 మంది ఇండిపెండెంట్లు గెలిచారు.
జెడ్పీటీసీల్లోనూ వైఎస్సార్‌సీపీదే హవా
జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయంఢంకా మోగిస్తున్నారు. 53 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపులో మంగళవారం అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు 24 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 13 జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. వీటిలో రెండు, మూడు మినహా తక్కిన స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తక్కువ మెజారిటీతో బయటపడ్డారు.
కాంగ్రెస్ కనుమరుగే...
జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రెండంకెలకే పరిమితమైంది. 43 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ ఖాతా తెరిచింది. జెడ్పీటీసీ స్థానాల్లో పూర్తిగా చతికిలపడింది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రాభవం కోల్పోయినట్లయింది. కోట్ల ప్రాతినిధ్యం వహించిన కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎక్కడా ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పోటీ చేసిన ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి మండలంలోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేకపోవడం చర్చనీయాంశమవుతోంది.