- పోటీనుంచి వైదొలగిన కాంగ్రెస్ అభ్యర్థి
- గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహించిన రఘువీరా
- నర్సీపట్నం కాంగ్రెస్ అభ్యర్థిదీ ఇదే బాట
సాక్షి, హైదరాబాద్: ‘‘మా పార్టీకి అభ్యర్థుల కొరత లేదు. టిక్కెట్ల కోసం వందలాది మంది పోటీ పడుతున్నారు. మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాం..’’ అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి బీ ఫామ్‌ల పంపిణీ సమయంలో ధీమాగా ప్రకటించారు. కానీ నామినేషన్ల ఉపసంహరణ నాటికి సీమాంధ్రలోని కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులు ఇద్దరు పోటీనుంచి నిష్ర్కమించారు. 140 ఏళ్ల చరిత్ర, పదేళ్లపాటు వరుసగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తు ఈ ఎన్నికల్లో 173 స్థానాల్లోనే కనిపించనుంది. అంటే రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గుర్తు హస్తం లేకుండానే ఎన్నికలు జరగనున్నాయన్నమాట. ఈ రెండింటిలో ఒకటి అనంతపురం జిల్లా కల్యాణదుర్గం. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి బి.దేవేంద్రప్ప బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇది ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మొన్నటివరకు ప్రాతినిధ్యం వ హించిన నియోజకవర్గం కావడం గమనార్హం. గతంలో మడకశిర నుంచి పోటీచేసిన రఘువీరారెడ్డి ఆ నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్ కావడంతో 2009 ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి పోటీచేసి గెలిచారు. రెవెన్యూ మంత్రిగా చేసిన ఆయన రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షునిగా నియమితులయ్యూరు. ప్రస్తుత ఎన్నికల్లో పెనుగొండకు మారిన రఘువీరా కల్యాణదుర్గానికి ఏరికోరి దేవేంద్రప్పను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కానీ ఆయన చివరకు బరిలోంచి తప్పుకోవడం, సొంత నియోజకవర్గంలోనే బ్యాలెట్‌పై కాంగ్రెస్ పార్టీ గుర్తు కనిపించని పరిస్థితి తలెత్తడం రఘువీరాకు ఇబ్బందికరంగా మారింది. ఇక విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కాంగ్రెస్ అభ్యర్థి కూండ్రు అప్పలనాయుడు కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.