
వైఎస్‌ఆర్‌తోనే ముస్లిం సంక్షేమం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: తమ సామాజిక వర్గానికి చెందిన వారికే లబ్ధి చేకూర్చే నాయకు లు రాజ్యమేలుతున్న రోజులవి. రుణం కావాలన్నా, పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా సిఫారుసు లేకపోతే పనిసాధ్యం కాని పరిస్థితులు. రాజకీయ అండలేని పేదలతో పాటు ముస్లిం వర్గాల వారు అంధకారంలో మగ్గిపోతున్న వేళ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి చుక్కానిలా, అందరి ఆత్మబంధువులా...ముఖ్యంగా ముస్లింకు అండగా నిలిచారు.
తమ సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం తమను ఓటు బ్యాంకుగా పరిగణించే తరుణంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖరరెడ్డి తమను, తమ బిడ్డలను ఆదుకున్నారని ముస్లింలు పొంగిపోయారు. అయితే ఆయన మరణానంతరం తమ పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయని వాపోతున్నారు. తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ దఫా మైనార్టీల గణనను కూడా చేయకపోవడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 32వేల మంది మైనార్టీలు ఉన్నట్టు గుర్తించారు. 2014 వచ్చే సరికి 20 శాతానికి పైగా పెరిగారు. ఈ సంఖ్య ఇప్పుడు సుమారు 45 వేలకు పెరిగింది.
చీకటి రోజులు...
2004 సంవత్సరానికి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లింలు అంధకారంలో మగ్గిపోయారు. ముస్లిం విద్యార్థులకు నిధుల మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించేది. నిధుల మంజూరును తగ్గించుకునేలా స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల వడపోత ఉండేది.దరఖాస్తు చేసినవారందరికి స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసేవారుకాదు. స్కాలర్‌షిప్‌లను తాము పొందవచ్చనే విషయమే చాలా మందికి తెలిసేది కాదు. దీంతో ఫీజులు చెల్లించడానికి, ఇతర అవసరాలకు సొమ్ములేక చాలా మంది ముస్లిం పిల్లలు మధ్యలోనే చదువు మానేసేవారు.
మహానేత హయాంలో...
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2008 నుంచి నిధులను అధికంగా విడుదల చేయడమే కాకుండా, తమకూ పెద్ద చదువులు చదువుకునే హక్కు తమకుందని ముస్లింలలో ఆత్మస్థైర్యాన్ని ప్రోదిచేశారు. అంతవరకూ తమ పిల్లలను చదివించలేక, ఆడపిల్లలకు పెళ్లి చేయలేక తీవ్ర ఇబ్బందులు పడిన ముస్లింలు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో జీవితాలను బాగుచేసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పిల్లలు చదువుబాటపట్టారు. అన్ని కళాశాలలు, పాఠశాలల్లో చదువుకుంటున్న మైనార్టీ విద్యార్థులకు మంచి వసతిని ఏర్పాటు చేయడమేకాకుండా స్కాలర్‌షిప్పులు అందించారు. వైఎస్ మృతి చెందిన తరువాత కూడా దరఖాస్తులు వెల్లువలావచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పోరాటాలు చేయడంతో తరువాత వచ్చిన పాలకులకు నిధులను విడుదల చేయక తప్పలేదు.