జేసీపై ముప్పేట దాడి | J.C. Diwakar Reddy attack | Sakshi
Sakshi News home page

జేసీపై ముప్పేట దాడి

Published Mon, Apr 21 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

J.C. Diwakar Reddy attack

సాక్షి ప్రతినిధి, అనంతపురం :  జిల్లా తెలుగుదేశం పార్టీపై ఆధిపత్యం కోసం జేసీ దివాకరరెడ్డి ఆరాటపడుతోన్న తీరుపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అభ్యర్థులను మార్చడం.. ఒకరికి ఇచ్చిన బీ-ఫారంను మరొకరికి ఇవ్వడం.. మిత్రపక్షానికి ఇచ్చిన స్థానంలో అభ్యర్థిని నిలబెట్టడంతో జేసీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి సైకిలెక్కిందే తడువు ఆధిపత్య పోరాటానికి తెర తీశారు. తాను పోటీ చేస్తున్న అనంతపురం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తాను సూచించిన వారినే బరిలో నిలపాలని బాబుకు దిశానిర్దేశం చేశారు.
 
 బీజేపీకి ఒక్క సీటు కేటాయించినా పోటీ చేయనని అల్టిమేటం జారీ చేశారు. జేసీ చెప్పినట్లే బాబు ఆడుతుండడంతో టీడీపీ శ్రేణులు నోరుమెదిపే సాహసం చేయలేదు. గత శుక్రవారం రాత్రి 11.30 గంటలకు అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును ఎంపిక చేసినట్లు అధినేత జిల్లా నేతలకు సంకేతాలు పంపారు. బీ-ఫారంను కూడా ఫ్యాక్స్‌లో అమిలినేనికి పంపారు. దీంతో శనివారం ఆర్భాటంగా నామినేషన్ వేయాలని ఆయన తలిచారు. దీన్ని పసిగట్టిన జేసీ దివాకరరెడ్డి.. తనతో సంప్రదించకుండా ఎలా టికెట్ ఇస్తారని బాబును నిలదీసినట్లు సమాచారం. తాను ప్రభాకర్ చౌదరికి మాటిచ్చానని, ఆయనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో అదే రోజు అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు అమిలినేనికి టికెట్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఆయనతో పాటు జిల్లా నేతలకు సమాచారం అందించారు. మరో అరగంటకే అనంతపురం స్థానంలో ప్రభాకర్ చౌదరిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు, జేసీలపై అమిలినేని మండిపడుతూ ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉండాలని తన అనుచరులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.  
 
 మండిపడుతోన్న శైలజానాథ్
 మాజీ మంత్రి శైలజానాథ్ ‘ఫ్యాన్సీ’ ఆఫర్ ఇచ్చి టీడీపీ టికెట్ కేటాయించాలని సీఎం రమేష్ ద్వారా బాబుతో బేరసారాలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు పీసీసీ చీఫ్ రఘువీరాను ఆశ్రయించిన ఆయన.. ఆ పార్టీ టికెట్‌పై శింగనమల స్థానానికి ఈనెల 15న నామినేషన్ వేశారు. శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు రవికుమార్‌కు ఇచ్చిన టికెట్‌ను ఈనెల 16న చంద్రబాబు వెనక్కి తీసుకున్నారు. కానీ.. బీ-ఫారం మాత్రం బండారు రవికుమార్ వద్దే ఉండిపోయింది.
 
 ఇది పసిగట్టిన జేసీ దివాకర్‌రెడ్డి.. తాను కాదన్న శైలజానాథ్‌కే శింగనమల టీడీపీ టికెట్ ఇప్పిస్తానని ఎర వేశారు. శుక్రవారం అర్ధరాత్రి చంద్రబాబుతో మంతనాలు జరిపి శైలజానాథ్‌కే టికెట్ ఖరారు చేయించారు. శనివారం ఉదయం బండారు రవికుమార్ నుంచి సేకరించిన బీ-ఫారంను తన సమీపబంధువైన డీసీసీబీ మాజీ చైర్మన్ తరిమెల కోనారెడ్డి ద్వారా శైలజానాథ్‌కు పంపినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ టికెట్‌పై శింగనమలలో నామినేషన్ వేసేందుకు శైలజానాథ్ బయలుదేరారన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ శమంతకమణి తన అల్లుడైన పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
 
 దీంతో ఆ పోలీసు ఉన్నతాధికారి తన మరదలికి టికెట్ ఇచ్చి, బీ-ఫారం పంపి, ఇప్పుడు మళ్లీ శైలజానాథ్‌కు టికెట్ ఎలా ఇస్తారని చంద్రబాబును నిలదీశారు. ఆ పోలీసు ఉన్నతాధికారి శక్తిసామర్థ్యాలు తెలిసిన చంద్రబాబు.. వెనక్కి తగ్గి చివరి నిముషంలో శైలజానాథ్‌కు టికెట్ నిరాకరించారు. శనివారం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన తనను శమంతకమణి తీవ్రంగా నిందించడంతో శైలజానాథ్ మనస్థాపం చెందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్ వేసి వెనక్కి వచ్చారు. బండారు రవికుమార్ నుంచి సేకరించి శైలజానాథ్‌కు ఇచ్చిన బీ-ఫారంను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆదివారం ఉదయం జేసీ దివాకర్‌రెడ్డిని చంద్రబాబు ఆదేశించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు శైలజానాథ్ నుంచి బీ-ఫారం వెనక్కి తీసుకోవడానికి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, తరిమెల కోనారెడ్డి తదితరులు విఫలయత్నం చేశారు. ఆ బీ-ఫారంను చింపివేసినట్లు శైలజానాథ్ చెప్పినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈవిషయం నిజం కాదని తెలియడంతో జేసీ పవన్‌కుమార్ స్వయంగా వెళ్లి బలవంతంగా బీ-ఫాం వెనకు తీసుకెళ్లినట్లు సమాచారం.
 
 పెడాకులైన పొత్తు
 పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన గుంతకల్లు అసెంబ్లీ స్థానంలోనూ జేసీ దివాకర్‌రెడ్డి వేలు పెట్టారు. బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన వెంకట్రామయ్య బలహీనమైన అభ్యర్థని.. ఇది అనంతపురం లోక్‌సభపై ప్రభావం చూపుతుందని చంద్రబాబుకు జేసీ వివరించారు. గుంతకల్లు నుంచి టీడీపీ అభ్యర్థిని దింపితే లోక్‌సభపై ఒకింత సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు.. శనివారం ఉదయం గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా జితేంద్రగౌడ్‌ను ఎంపిక చేసి.. బీ-ఫారంను ఫ్యాక్స్‌లో పంపారు. అదే బీ-ఫారంతో జితేంద్రగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని వెంకట్రామయ్య నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు.
 
 తమకు కేటాయించిన సీట్లలో మీరెలా పోటీచేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబును రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం నిలదీశారు. గుంతకల్లు బరిలో నుంచి టీడీపీ అభ్యర్థిని తప్పించకపోతే.. అనంతపురం జిల్లాలో వివిధ స్థానాల్లో పోటీలో ఉన్న తమ అభ్యర్థులకు బీ-ఫారంలు ఇస్తామని స్పష్టీకరించినట్లు సమాచారం. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించింది. బీజేపీ అధిష్టానం వద్ద సాగిలపడి కుదుర్చుకున్న పొత్తు.. జేసీ తీరు వల్ల పెడాకులయ్యే పరిస్థితి ఉత్పన్నమైందని ఆ పార్టీ సీనియర్ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి తెలపడం కొసమెరుపు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement