ఎవరికి దక్కేనో? | Independents will be the key to | Sakshi
Sakshi News home page

ఎవరికి దక్కేనో?

Published Sat, May 24 2014 1:15 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

ఎవరికి దక్కేనో? - Sakshi

ఎవరికి దక్కేనో?

  • ఆరు మండలాల్లోఉత్కంఠ
  •   కీలకం కానున్న స్వతంత్రులు
  •   ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తరువాతే నోటిఫికేషన్
  •  జిల్లాలో పోటాపోటీగా సాగిన సాగిన మండల పరిషత్ ఎన్నికల్లో పలుచోట్ల నువ్వానేనా అన్నట్టు ఫలితాలు రావడంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు మండలాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ చెరిసగం స్థానాలు దక్కించుకోవడంతో హంగ్ ఏర్పడింది. అవనిగడ్డ, గన్నవరం, ఉయ్యూరు మండలాల్లో పోటీపోటీగా స్థానాలు రాగా అధ్యక్ష పీఠం కోసం స్వతంత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
     
    సాక్షి, మచిలీపట్నం : మండల పరిషత్‌లను దక్కించుకునేందుకు జిల్లాలో హోరాహోరీ పోరు సాగింది. అత్యధిక మండలాల్లో ఏదో ఒక పార్టీకి పాలక పగ్గాలు అప్పగించేలా ఫలితాలు వచ్చాయి. జిల్లాలో 25 మండలాలను టీడీపీ కైవసం చేసుకుంది. 18 మండలాల్లో వైఎస్సార్‌సీపీ పాలకపగ్గాలు చేపట్టే మెజార్టీ ఎంపీటీసీలను దక్కించుకుంది. మరో 6 మండలాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నువ్వానేనా అన్నట్టు ఎంపీటీసీలను సాధించడంతో స్వతంత్ర అభ్యర్థుల మద్దతుపై ఆధారపడాల్సి వస్తోంది.

    జిల్లాలోని పలు మండలాల్లో ఇరు పార్టీలు సమానంగా ఎంపీటీసీలను సాధించుకోవడంతో హంగ్ ఏర్పడింది. స్థానిక పాలకవర్గాల ఎన్నికలో ఆయా నియోజకవర్గ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకపోవడంతో హంగ్ ఏర్పడిన మండలాల్లో లాటరీ ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎంపిక చేస్తారు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం మండల పరిషత్ పాలకవర్గాల ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హంగ్ ఏర్పడిన పలు మండలాల్లో పాలకవర్గాలను చేజిక్కించుకునేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
     
    ఉత్కంఠ రేపుతున్న ఆ ఆరు...
     
    జిల్లాలోని నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు, అవనిగడ్డ, గన్నవరం, ఉయ్యూరు మండలాల్లో మండల పరిషత్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఆరు మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఏ పార్టీ చేజిక్కించుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. నూజివీడు మండలంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ చెరో పది స్థానాలు గెలుచుకున్నాయి. ఆగిరిపల్లి మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా రెండు పార్టీలు చెరో 9 చొప్పున దక్కించుకున్నాయి. బాపులపాడు మండలంలో మొత్తం 24 ఎంపీటీసీల్లో చెరిసగం సాధించాయి.
     
    అటు ఇటు అయితే..

    జిల్లాలోని అవనిగడ్డ, గన్నవరం, ఉయ్యూరు మండలాలల్లో బలాబలాలు అటు ఇటు అయితే పాలకపగ్గాలు చేతులుమారే అవకాశం ఉంది. అవనిగడ్డ మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్‌సీపీ 4, టీడీపీ 5, స్వతంత్రులు 3 మూడు చోట్ల గెలుపొందారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ముగ్గురు వైఎస్సార్‌సీపీకే మద్దతు ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చారు. అయితే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒక ఎంపీటీసీ గాజుల పోతురాజుకు ఎంపీపీ ఇస్తే వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తామని మెలికపెట్టినట్టు సమాచారం.

    దీంతో మండల పరిషత్‌ను వైఎస్సార్‌సీపీ దక్కించుకున్నా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఏదో ఒక దానిని స్వతంత్రులకు త్యాగం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గన్నవరం మండలంలో 25 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో టీడీపీ, బీజేపీ, సీపీఐ 12, వైఎస్సార్‌సీపీ, సీపీఎం మిత్రపక్షాలు 11 స్థానాలు గెలుచుకున్నాయి. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తామని ముందు చెప్పి గెలిచిన ఇద్దరు స్వతంత్ర ఎంపీటీసీలు ఇప్పుడు టీడీపీ వైపు తిరిగినట్టు సమాచారం.

    ముస్తాబాద, సూరంపల్లిలో గెలిచిన ఇద్దరు ఎంపీటీసీల మద్దతు కలిసిరావడంతో గన్నవరం మండలంలో టీడీపీ పాలకపగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఉయ్యూరు మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 5, టీడీపీ 4 గెలుచుకున్నాయి. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి నిలిపిన స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలవడంతో వారిద్దరి మద్దతుతో వైఎస్సార్‌సీపీ మండల పరిషత్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఒక స్వతంత్ర అభ్యర్థిని తమవైపునకు తిప్పుకొనేలా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయినా అక్కడ వైఎస్సార్‌సీపీకే పాలక పగ్గాలు దక్కుతాయి.
     
     ఉయ్యూరు మున్సిపాలిటీ హంగ్..

     జిల్లాలోని ఉయ్యూరు మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉయ్యూరు నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ తొమ్మిది మంది చొప్పున కౌన్సిలర్‌లను గెలుచుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. వారిలో ఒక కౌన్సిలర్ టీడీపీకి, మరో కౌన్సిలర్ వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారు. దీంతో ఇరు పార్టీలకు పదేసి మంది కౌన్సిలర్‌ల బలం చేకూరడంతో హంగ్ ఏర్పడింది. అయితే పెనమలూరు ఎమ్మెల్యే పదవిని టీడీపీ దక్కించుకుంది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఓటుతో ఉయ్యూరు మున్సిపాలిటీ టీడీపీ పరమయ్యే అవకాశం ఉంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement