వెంకటాచలం, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యఅనుచరుడు కాకుటూరుకు చెందిన డబ్బుగుంట వెంకటేశ్వర్లుయాదవ్‌తో పాటు ఆయన అనుచరులు, యర్రగుంటకు చెందిన ప్రసాద్, వెంకటేశ్వర్లు, మోహన్, పెంచలయ్య, శీనయ్య, లక్ష్మయ్య, సుబ్రహ్మణ్యం, ఏడుకొండలుతో పాటు పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు.
నెల్లూరులోని గోవర్ధన్‌రెడ్డి నివాసంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త రాష్ట్ర నిర్మాణం, వైఎస్సార్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే చేయగలరన్నారు. అధికార దాహంతో చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వాటిని అమలు చేయడం సాధ్యమేనే అని ఆయనను ఆనే ప్రశ్నించుకోవాలని హితవుపలికారు. అప్పట్లో వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించిన చంద్రబాబు కరెంట్ బిల్లులు చెల్లించని వారిపైనా కేసులు పెట్టించారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని చీకటి మయం చేసి ప్రజలను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించి, ఇప్పుడు అధికారం కోసం అభివృద్ధి చేస్తానని అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించడం హాస్యాస్పదమన్నారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం అధిష్టించిన చంద్రబాబు, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలోబియ్యం, సంపూర్ణమద్యపాన నిషేధం పథకాలకు తూట్లు పొడిచారన్నారు. రేషన్ బియ్యం ధరను రూ.5.25కి పెంచడంతో పాటు ఊరూరా మద్యం బెల్టుషాపులను తెరిపించిన ఆయన ఘనతను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైలుపై చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తుది శ్వాసవిడిచేంత వరకూ దానిని అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు, ఆయన మరణం తర్వాత అధికారం చేపట్టిన వారు తూట్లు పొడిచారన్నారు. వైఎస్సార్ ఆశయసాధన జగన్‌తోనే సాధ్యమన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెంకటాచలం జెడ్పీటీసీ అభ్యర్థి మందల వెంకటశేషయ్య, పి.ఖయ్యూమ్‌ఖాన్, కుడితిపూడి మురళీధర్ నాయుడు తదితరులు పాల్గోన్నారు.