అంతుచిక్కని వ్యూహం!
అంతుచిక్కని వ్యూహం!
Published Wed, Apr 23 2014 3:37 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:‘తెలంగాణలో నాకు ఇష్టమైన నాయకుడు జగ్గారెడ్డి’ అని పవన్ కల్యాణ్ చెప్పడం వెనుక వ్యూహం ఏమిటీ? ‘కాంగ్రెస్ హటావో.. దేశ్‌కీ బచావో’ అని పవణ్ కల్యాణ్ కాంగ్రెస్ మీద కత్తులు నూరుతుంటే జగ్గారెడ్డి మాత్రం ‘పవనిజం’నే ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రయోగించడంలో మర్మం ఏమిటీ?.. ఆఖరి క్షణంలో పవన్ కల్యాణ్ సంగారెడ్డిలో జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేస్తారా?.. పవన్ తమ తరఫున ప్రచారానికి వస్తాడనుకున్న బీజేపీ కూటమి ఆశలు అడియాశలేనా?.. జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే అంశంపై చర్చించుకోవడం గమనార్హం. మరో వైపు కాంగ్రెస్ పార్టీని బద్ధ శత్రువుగా చూస్తున్న వ్యక్తి ఫొటోనే పెట్టుకొని నాకో ఓటు, మా ఎంపీ అభ్యర్థికో ఓటు వేయండని జాగ్గారెడ్డి జనాన్ని ఓట్లు అడగడం చూసి కాంగ్రెస్ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. ‘ఫైర్ బ్రాండ్’ జగ్గారెడ్డి స్టైలే వేరు. జనంలోకి వెళ్లినా.. జగడమాడినా తన ‘మార్కు’ ఉండాల్సిందే.
మనసుకు నచ్చింది చేయడం... కడుపులోంచి వచ్చిందే గలగల మాట్లాడి వార్తల్లోకి ఎక్కడం ఆయన నైజం. జిల్లాలో ఇప్పుడు అదే జరుగుతోంది..‘తెలంగాణలో నాకు ఇష్టమైన నాయకుడు జగ్గారెడ్డి.. నమ్మిన వాళ్ల కోసం ఎంతకైనా కొట్లాడే నాయకుడాయన’ అని జనసేన పార్టీ ప్రకటన సభలో సినిమా స్టార్ పవన్ కల్యాణ్ చెప్పిన విషయం విదితమే. సభలో తన గురించి అంత గొప్పగా చెప్పిన పవన్ ఫొటోను క్యాసెట్‌లో పెట్టుకుంటే తప్పేమిటి అనుకున్నాడో ఏమో..! జగ్గారెడ్డి తన ఎన్నికల ప్రచార సీడీలో పవన్ కల్యాణ్‌కు పెద్దపీట వేశారు. పవన్ అభివాదం చేసే చిత్రాలతో పాటు జనసేన పార్టీ స్థాపించిన సభా దృశ్యాలను సీడీలో పొందుపరిచారు. సీడీలో 30 సెకన్ల నిడివిలో పవన్ కల్యాణ్ దృశ్యాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పవన్ కల్యాణ్‌ను క్లిప్పింగ్స్‌ను కాంగ్రెస్ సభల్లోనే ప్రదర్శించడం ఆసక్తికర చర్చగా మారింది.
ఇదే విషయాన్ని జగ్గారెడ్డిని అడిగితే నవ్వుతూనే ‘మీ పేపరోళ్లు ఎప్పుడూ ఇంతేనయ్యా... పుట్టను తొవ్వి పురుగులు పట్టే పనే చేస్తారు. రూ. 400 కోట్లు తెచ్చి నియోజకవర్గంలో ఖర్చు చేశా, దాని గురించి రాయండయ్యా అంటే రాయనే రాయరు. పవన్ కల్యాణ్‌కు నాకు ఏ దోస్తాని లేదు.. నేను ఆయనకు ఎందుకు నచ్చానో కూడా తెలి యదు. సీడీలో ఆయన దృశ్యాలు అంటారా..! అది జిల్లా యువజన కాంగ్రెస్ రూపొందించిన సీడీ. నిండు సభలో పవన్ నా గురించి గొప్ప గా మాట్లాడటం నా అభిమానులకు నచ్చి ఉంటుంది. అందుకే వాళ్ల సీడీలో ఆయన బొమ్మ పెట్టుకొని ఉంటారు’ అని నర్మగర్భంగా సమాధానం చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, బీజేపీ కూటమి నేతలు మాత్రం ఏం చేసినా జగ్గారెడ్డికే చెల్లుతుందని చెవులు కొరుక్కుంటున్నారు.
Advertisement