భజన సేన
ఇంటర్వ్యూ: వరవరరావు
మోడీకి చెక్కభజన చేసే సరికొత్త అస్త్రం జనోద్ధరణకు రావడంలేదు..
బాబు, వెంకయ్య, జేపీల ఆలోచనల అమలుకే తెరమీదికి
పెట్టుబడి వర్గాల పంచన చేరిన వ్యక్తి పవన్
వనం దుర్గాప్రసాద్: రంగుమార్చిన రాజకీయం కొత్తదారులను అన్వేషిస్తోందని, అది పవన్ కళ్యాణ్ రూపంలో తెరమీదకొస్తోందని ప్రముఖ విప్లవ కవి, విరసం సభ్యుడు, రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు వరవరరావు అంటున్నారు. ఓ సామాజికవర్గం యువత ఓట్లకు గాలం వేయడం కోసమే పవన్‌ను అస్త్రంగా మార్చుకుందనేది ఆయన అభిప్రాయం. విధ్వంస చరిత్రే తెలిసిన చంద్రబాబు, పెట్టుబడిదారుల పక్షమే వహించే వెంకయ్యనాయుడు, జేపీ ఆలోచనల్లోంచి పవన్ ఎలా పుట్టుకొచ్చారో వివరించారు. తొమ్మిదేళ్ళ బాబు మారిపోయాననే నీతి మాటల్లో నిజమే లేదంటున్నారు. నిషేధాలు లేని, నిర్బంధం లేని, ఆంక్షలకు అవకాశం లేని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కొత్త ప్రభుత్వాల్లో కన్పించాలనేది ఆయన కోరిక. అప్పటి వరకూ పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్న వరవరరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ.....
అది జనసేన కాదు... భజన సేన. నరేంద్ర మోడీకి చక్క భజన చేసే సరికొత్త అస్త్రమది. చంద్రబాబు కుయుక్తుల్లోంచి, వెంకయ్యనాయుడు వ్యూహాల్లోంచి, జయప్రకాశ్ నారాయణ పెట్టుబడిదారి ఆలోచనలకు ప్రతిరూపమే పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి మరో సామాజికవర్గం గళం అవసరమైంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న యువతను ఓటుగా మార్చే ఆయుధం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తెరమీదకొచ్చారు. అవినీతి నిర్మూలన ముసుగేసుకున్నారు. నీతి వచనాలు వల్లిస్తూ మూడు శక్తుల ఆలోచనలను అమలు చేస్తున్నాడు. అంతే తప్ప జనాన్ని ఉద్ధరించడానికి పవన్ రాజకీయాల్లోకి రాలేదు. అలా చెప్పడం ఓ నయ వంచనే.
ప్రజల కోసమా? మోడీ కోసమా?
ప్రజలకు ఏదో చేస్తానని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మోడీని ఎందుకు కలిశాడు? తొమ్మిదేళ్ళూ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగించిన చంద్రబాబు ఆలోచనలకు ఎందుకు దగ్గరవుతున్నాడు? పెట్టుబడివర్గ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న జయప్రకాశ్ నారాయణ, వెంకయ్యనాయుడు స్క్రిప్ట్‌నే ఎందుకు అమలు చేస్తున్నాడు. అతను నిజంగా సామాజిక మార్పు కోరుకుంటే, ముందుగా జనం వద్దకు వెళ్ళా లి. వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి. వాటి కోసమే ఉద్యమించాలి. అసలా చరిత్ర పవన్‌కు ఉందా? ఏనాడైనా కష్టపడి చేశాడా? లేనప్పుడు చెమటోడ్చే శ్రామికవర్గం మనోభావాలేంటో అతనికెలా తెలుస్తాయి? ఇక ముందైనా అలా ఉంటాడు అనడానికి ఏ ఒక్క ఆధారమైనా ఉందా? వచ్చీరావడమే పెట్టుబడి వర్గాల పంచన చేరిన వ్యక్తి జనం కోసమే పనిచేస్తానంటే ఎలా నమ్ముతారు. అతను వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించవద్దని శాసిస్తున్నాడు. జనం మధ్యకు వచ్చి ఆ విధంగా కోరుకునే హక్కు ఎక్కడిది?
పవన్ పార్టీ పెట్టడం ఓ పెద్ద కుట్ర. ఆయన వెనుక అల్లు అరవింద్ పాత్ర ఉందనేది సుస్పష్టం. హైదరా బాద్‌లో వాళ్ళకు అపరిమితమైన ఆస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆస్తులు కాపాడుకోవాలి. హైదరాబాద్ మరో పదేళ్లూ కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. శాంతి భద్రతలు గవర్నర్ అధీనంలో ఉంటాయి. కాబట్టి అక్రమాస్తులు భద్రంగా ఉండాలంటే రాజకీయ అండదండలు కావాలి. చిరంజీవి ఎలాగో కాంగ్రెస్‌లో ఉన్నారు. రేపు ఒకవేళ మోడీ అధికారంలోకి వస్తే... అక్కడా చక్రం తిప్పే వ్యక్తి కావాలి. పవన్ రాజకీయ అరంగేట్రం వెనుక వ్యూహం ఇదే...
పంచ్
అన్నదమ్ములిద్దరూ ‘రాజ్యం’ పంచుకొన్నారు.. ‘ప్రజారాజ్యం’
కాంగ్రెస్‌లో కలిసింది, ‘యువరాజ్యం’ తెలుగుదేశంలో కలుస్తోంది..
పవన్ మీకు తెలీదేమో, నీకు బాగా నచ్చుతున్న మోడీ మీద కూడా ఉన్నాయి అభియోగాలు!
2009లో అన్న సీఎం కాకపోతే రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తనన్నాడుగా ఆ మాట ఏమైందో!
ఎన్టీవీ సర్వే వచ్చిన మరుసటి రోజే చంద్రబాబు పవన్‌ను ప్రయోగించాడు!
33 కేసుల్లో స్టే ఉన్నవాళ్లు మంచి పాలన ఇస్తారా!!? తెలుగోడి గ్యాస్‌ను దొంగదారిన మళ్లించిన వాడు ఇస్తాడా?!
పవన్ కళ్యాణ్ పేపర్ చదవడా? టీడీపీలో 33 శాతం మంది క్రిమినల్స్ ఉన్నారు. వారిపై ఈయన ఏమంటాడు?!
టీడీపీ వాళ్లు 2004లో బీజేపీతో పొత్తు వల్ల ఓడిపోయమన్నారు, 2009లో ప్రజారాజ్యం వల్ల లోక్‌సత్తాల వల్ల ఓడిపోయామని చెప్పుకున్నారు, 2014లో పవన్ కళ్యాణ్‌ను కలుపుకోవడం వల్ల ఓడిపోయామని అంటారు. సాకు దొరికేసిందోచ్!
పవన్ కల్యాన్‌ను చంద్రబాబు గతంలో తాగుబోతుగా అభివర్ణించాడు.
ఇప్పుడు పవన్ మాటలను చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది!
తికమక బాబుకు తిక్కలోడు తోడయ్యాడు..ఇపుడు లెక్కలు తేల్చాసింది ప్రజలే!