మాట తప్పుతారా?
* కాంగ్రెస్‌పై నారాయణ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో సీపీఐ సీట్ల సర్దుబాటు పంచపాండవులు మంచపు కోళ్లను తలపించింది. తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాలు కోరిన సీపీఐ.. ఆ సంఖ్యను 12కు కుదించుకుంది. చివరకు సంప్రదింపుల అనంతరం సీపీఐకి కాంగ్రెస్ 9 స్థానాలే ఇచ్చింది. కాంగ్రెస్ జాబితా విడుదలతో మిత్రపక్షానికి కాంగ్రెస్ మరో ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీకి కేటాయించే సీట్ల జాబితాలో ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్ స్థానానికి కాంగ్రెస్ సోమవారం అభ్యర్థిని ప్రకటించింది. దీంతో సీపీఐకి 8 స్థానాలే మిగిలాయి.
వీటిలోనూ సీపీఐ కోరిన ఓ సీటును మార్చి మరొకటిచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్‌కు అభ్యర్థిని కూడా ప్రకటించుకున్న సీపీఐ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ తీరుతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమకు కేటాయించిన స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. పైగా, తాము కోరని కోదాడ సీటును కాంగ్రెస్ ఖాళీగా వదిలిందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను కాదనుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఇంత దెబ్బ కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన మాటను ఎలా తప్పుతారంటూ సీపీఐ తెలంగాణ, సీమాంధ్ర ఉమ్మడి కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను సంప్రదించేందుకు సీపీఐ నేతలు ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో పార్టీ తెలంగాణ నేతలు సోమవారం సాయంత్రం నారాయణ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అసమ్మతిని తెలపడంతో పాటు స్టేషన్ ఘన్‌పూర్ స్థానాన్ని సీపీఐకే కేటాయించాలని కోరాలని నిర్ణయించారు.