రెబెల్స్‌ను తప్పించండి
* టీపీసీసీ చీఫ్ పొన్నాలతో నారాయణ
సాక్షి, హైదరాబాద్: పొత్తులో భాగంగా తమకు కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్ నేతలు నామినేషన్లు దాఖలు చేయడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ బి.ఫాం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మల్‌రెడ్డి సహా రెబెల్ అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నారాయణ కోరారు. శుక్రవారం పొన్నాల నివాసానికి వచ్చిన ఆయన..ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు, పార్టీ నేతల పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు.
అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఇరుపార్టీలకు లాభిస్తుందని పొన్నాల అభిప్రాయపడ్డారు. హైకమాండ్ ఆదేశాల మేరకే మహేశ్వరం నియోజకవర్గంలో మల్‌రెడ్డికి బి.ఫాం ఇచ్చామన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పని చేసినప్పటికీ మల్‌రెడ్డిని బరి నుంచి తప్పుకోవాలని ఆదేశించామన్నారు. తమకు కేటాయించింది ఏడు సీట్లే అయినప్పటికీ వాటిలోనూ కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేయడం సరికాదని నారాయణ అన్నారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్సీసహా నామినేటెడ్ పదవులు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకుని పోటీ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.
మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా కచ్చితంగా నామినేషన్‌ను ఉపసంహరించుకోవాల్సిందేనని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకొస్తే ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామిగా ఉండాలా? వద్దా? అనేది పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందన్నారు. తమకు ఏడు సీట్లే ఇవ్వడం పట్ల అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, అయితే పొత్తు ఖరారైనందున సంతృప్తితో ఎన్నికల్లోకి వెళుతున్నామని నారాయణ చెప్పారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తే ఎన్నికలు ఏకపక్షంగా జరిగేవని, కేసీఆర్‌కు ఇన్ని తిప్పలు ఉండేవి కావని ఆయన వ్యాఖ్యానించారు.
పొన్నాలతో కరీంనగర్ నేతల భేటీ
ఈ నెల 16న కరీంనగర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వస్తున్న నేపథ్యంలో ఆ జిల్లా నేతలతో పొన్నాల శుక్రవారం సమావేశమయ్యారు. మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ సహా జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ కూడా చర్చలో పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన తరువాత తొలిసారి సోనియాగాంధీ వస్తున్నందున భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని సమావేశంలో నిర్ణయించారు.