దమ్ముంటే నా ఆస్తులపై విచారణ జరిపించు.
పొన్నాలకు కేసీఆర్ సవాల్ ఠ నువ్వెంత... నీ బతుకెంత.. పిచ్చికూతలు కూస్తే నాలుక చీరే స్తా
పీసీసీ పదవి కొనుక్కుని టికెట్లు అమ్ముకున్నోడివి... నన్ను విమర్శిస్తావా? సన్నాసుల చేతిలో రాష్ట్రాన్ని పెడితే అధోగతే కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణను వల్లకాడు చేసినయి కబ్జా భూముల కోసమే బీజేపీతో బాబు దోస్తీ టీడీపీకి ఓటేస్తే.. మోరీలో పారేసినట్లే టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే }రామరక్ష అని వ్యాఖ్య కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ సుడిగాలి పర్యటన
కరీంనగర్: ‘‘పొన్నాలా.. పిచ్చికూతలు కూస్తున్నవ్. నీ లెక్కెంత...నీ బతుకెంత... ఇలానే కూతలు కూస్తే నాలుక చీరేస్తా. నా ఆస్తులపై విచారణ జరిపిస్తావా.. దమ్ముంటే విచారణ జరిపించు..’’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సవాల్ విసిరారు. ఆంధ్రోళ్లు మన నీళ్లు ఎత్తుకుపోతుంటే జెండా ఊపి, పదవుల కోసం నోరుమూసుకున్న వ్యక్తికి.. టీఆర్‌ఎస్‌ను విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. పొన్నాల పీసీసీ పదవి కొనుక్కుని, టికెట్లు అమ్ముకున్నాడని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తుంటే.. తనపై కారుకూతలు కూయడమేమిటని విమర్శించారు. సోమవారం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. కోరుట్ల నుంచి మొదలైన కేసీఆర్ పర్యటన ధర్మపురి, జగిత్యాల, గంగాధర (చొప్పదండి), కథలాపూర్ (వేములవాడ), తిమ్మాపూర్ (మానకొండూర్), హుజూరాబాద్, మంథని, పెద్దపల్లితో పాటు మెదక్ జిల్లా దుబ్బాకలో సాగింది. కాంగ్రెస్, టీడీపీలను విమర్శిస్తూ.. టీఆర్‌ఎస్ హామీలను ప్రస్తావిస్తూ కేసీఆర్ ప్రసంగాలు కొనసాగాయి.
మా సోపతి ఎందుకు?
తెలంగాణ బిల్లులో టీఆర్‌ఎస్ పాత్ర లేనపుడు కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌కు సోపతేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదని సోనియాగాంధీ చెబుతున్నారని.. అలాంటప్పుడు విలీనం విషయంలో తాను మాట తప్పాననడం సిగ్గుచేటని మండిపడ్డారు. 2012 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధిష్టానం పిలిస్తే ఢిల్లీకి వెళ్లామని, కానీ హైదరాబాద్‌పై కిరికిరి పెట్టడంతో తిరిగి వచ్చేశామని చెప్పారు. కాంగ్రెస్‌తో ఇక యుద్ధమేనని 2012 నవంబర్ 7, 8 తేదీల్లో కరీంనగర్ వేదికగా జరిగిన మేధోమథన సదస్సులో ప్రకటించామని గుర్తు చేశారు. తాను తప్పులు చేసి ఉంటే కాంగ్రెసోళ్లు ఎప్పుడో జైలుకు పంపేవారని.. తప్పులు దొరకకే పిచ్చికూతలు కూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఏమరుపాటుగా ఉంటే మళ్లీ గోస తప్పది..
‘‘తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లుగా లాఠీచార్జీలు, తుపాకీ తూటాలను ఎదుర్కొన్నాం.. దీక్షలు చేశాం.. కేసుల పాలయ్యాం.. రాష్ట్ర కలను సాకారం చేసుకున్నాం.. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. సన్నాసుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టినా.. అధోగతి పాలుకాక తప్పది. 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రాన్ని వల్లకాడు చేసినయి. మళ్లీ మేమే సిపాయిలమంటూ.. రాష్ట్రాన్ని మేమే ఇచ్చామంటూ ఎగేసుకొని వస్తున్నరు.. జాగ్రత్త.. వారిని నమ్మితే నట్టేట మునుగుడే.. 1948లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అప్పటి నాయకుల తప్పిదాల వల్ల 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విలీనమైంది. తిరిగి తెలంగాణ సాధనకు 60 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ భవిష్యత్ తరాలకు అనుకూలంగా ఓటు వేయకపోతే మళ్లీ కష్టాలు తప్పవు..’’ అని కేసీఆర్ హెచ్చరించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు శ్రీరామరక్ష అని, టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నూరుశాతం అమలుచేసి తీరుతామని చెప్పారు.
హామీలన్నీ నెరవేరుస్తం..
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ. లక్ష వరకూ రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో నీళ్లు వచ్చేలా సిద్దిపేట తరహాలో మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. దళితుల కోసం ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామన్నారు. ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు. ధర్మపురి, యాదగిరిగుట్టలను పుణ్య క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబునాయుడు ఆంధ్రా బాబేనని, దేవుళ్ల దగ్గర కూడా అపచారం చేసిన చంద్రబాబు ఇప్పటివరకు తగిన ఫలితం అనుభవిస్తూనే ఉన్నాడని విమర్శించారు.
శ్రీధర్‌బాబు ఆట ముగిసింది..: తెలంగాణ ద్రోహిగా మిగిలిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆట ముగిసిపోయిందని కేసీఆర్ అన్నారు. మంథని సభలో శ్రీధర్‌బాబు వైఖరిని ఎండగట్టారు. మంథనిలో పుట్ట మధును గెలిపిస్తే మంథనిలో కుర్చీవేసుకొని కూర్చొని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
కబ్జా భూముల కోసమే బీజేపీతో చంద్రబాబు దోస్తీ
తెలంగాణలో లక్షా పైచిలుకు ఎకరాల ట్రస్టు భూములు కబ్జాకు గురయ్యాయని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుంటారనే భయంతోనే చంద్రబాబునాయుడు బీజేపీతో జతకట్టాడని కేసీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో భూదాన్, గౌతమి ట్రస్టు భూములు, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన భూములు పరుల చేతుల్లో ఉన్నాయన్నారు. టీడీపీ ఆంధ్రా పార్టీ అని.. దానికి ఓటేస్తే మోరీలో పారేసినట్లేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇంకా టీడీపీ జెండాలను పట్టుకుని తిరగడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని.. తమ్ముళ్లు కష్టపడి సంపాదించిన సొమ్మును ఖాళీ చేయించేందుకు చంద్రబాబు కుట్రపన్నాడని ఆరోపించారు.
వచ్చేది టీఆర్‌ఎస్ సర్కారే..
సంగారెడ్డి: ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను చేయించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైందని మెదక్ జిల్లా దుబ్బాకలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. ఆంధ్రోళ్లు చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు రెండు మూడేళ్లు కరెంట్ కష్టాలు తప్పవన్నారు. ఈ సభల్లో టీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, పేర్వారం రాములు, వినోద్‌కుమార్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌తో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు.