వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ మాయం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ ఉనికి ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీ బిల్లు పార్లమెంట్‌లో చర్చిస్తున్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. మోడీ లేదు గీడీ లేదు.. అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఒక కేసీఆర్ వల్లనే సిద్ధించలేదని, వందలాది మంది అమరుల త్యాగం.. ఉద్యమాల ఫలితంగానే వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రత్యామ్నాయం లేకనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలంగాణ కోసం బీజేపీ చిత్తశుద్ధితో ఉద్యమించిందని, తెలంగాణ జేఏసీలో జాతీయ పార్టీగా కీలక పాత్ర పోషించిందని చెప్పారు. రాహుల్ రాజకీయ అవగాహన లేని దద్దమ్మ అని, పప్పుసుద్ద అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మన్మోహన్ ముఖంలో ఏనాడూ చిరునవ్వులు చూడలేదని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నవ్వకపోతే ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారని ఎద్దేవా చేశారు. సోనియా, రాహుల్‌గాంధీలు మోడీ తుఫానులో కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. రజాకారుల వారసత్వమే ఎంఐఎం పార్టీ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేత అక్బరొద్దీన్ గతంలో నిర్మల్‌లో మెజార్టీ ప్రజల పండుగలను అవహేళన చేస్తూ మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమిస్తే కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్లి సూట్‌కేసులు తెచ్చుకున్నారని సభలో పాల్గొన్న సినీ నటి జీవిత రాజశేఖర్ విమర్శించారు.