
జన సునామీ
గన్నవరం జన ప్రభంజనమైంది. రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. తమ అభిమాన నేత జగన్‌మోహన్ రెడ్డిని చూసేందుకు వెల్లువెత్తిన ప్రజాభిమానం జన సునామీని తలపించింది. ఓ పక్క 39 డిగ్రీల ఉష్ణోగ్రత.. భగభగలాడుతూ తన ప్రతాపం చూపుతున్న భానుడు.. అయినా ఖాతరు చేయని జనం జగన్ జనభేరికి పోటెత్తారు.అభిమాన నేతకు అఖండ స్వాగతం పలికారు.
సాక్షి, విజయవాడ : వెల్లువెత్తిన అశేష జనాభిమానం, ఉప్పొంగిన జనాభిమానం నడుమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనభేరి ఎన్నికల ప్రచార యాత్ర మంగళవారం జిల్లాలో ప్రారంభమైంది. తొలిరోజు గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో జననేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి విజయవాడ నగరం మీదుగా గుంటూరుకు పయనమయ్యారు.
గన్నవరంలో జనహోరు...
గన్నవరం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిటకిటలాడింది. గన్నవరం రాజకీయ చరిత్రలో ఏ పార్టీ సభలకూ రాని రీతిలో ప్రజలు వేలాదిగా తరలిచ్చారు. పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఇదే గన్నవరంలో జరిగిన భారీ సభ అని పేర్కొనే రీతిలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి గన్నవరం మూడు బొమ్మల సెంటర్ జనసంద్రంగా మారింది. తమ అభిమాన నేతను చూసేందుకు యువకులు, మహిళలతో పాటు వృద్ధులు కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 11.45 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా హైదరాబాదు నుంచి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్టీ నేతలతో కలసి గన్నవరానికి పయనమయ్యారు. మూడు బొమ్మల సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. వెలువెత్తిన అశేష జనాభిమానం నడుమ మూడు బొమ్మల సెంటర్‌కు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార రథం పైనుంచి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విమర్శలకు ప్రజాస్పందన వెల్లువెత్తింది.
ప్రత్యక్షంగా మాట్లాడుతూ.. సమస్యలు తెలుసుకుంటూ..
సభ అనంతరం గంటలతరబడి తనకోసం వేచివున్న మహిళలు, వికలాంగులు, వృద్ధులు, రైతులతో జగన్ ప్రత్యక్షంగా మాట్టాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ రోడ్‌షోగా ముందుకు సాగారు. జననేతను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. పింఛను రావటం లేదని చెప్పిన వృద్ధులతో ‘మరో పది రోజులు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది.. మీ అందరి కష్టాలు తొలగుతాయి’ అని భరోసా ఇచ్చారు. కార్మికుల సమస్యలు సావధానంగా విని వారికి అండగా ఉంటానని ఆత్మస్థైర్యం నింపారు. కేసరపల్లి, గూడవల్లి మీదుగా నిడమానూరు చేరుకున్న జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. ‘అయ్యా మా కష్టాలు వినాలి.. మీరు మా ఊళ్లోకి రండి’ అంటూ పట్టుపట్టి మరీ నిడమానూరు గ్రామంలోకి తీసుకెళ్లారు. గ్రామంలో అపూర్వ స్వాగతం పలికి సమస్యలు విన్నవించారు. అక్కడి నుంచి ఎనికేపాడు చేరుకున్న జగన్ రోడ్డుపై తన కోసం నిరీక్షిస్తున్నవారితో మాట్లాడుతూ ఆత్మీయంగా కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ప్రసాదంపాడులో రోడ్‌షో నిర్వహించారు. రామవరప్పాడు రింగ్ సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రామవరప్పాడుతో మొదటిరోజు యాత్ర ముగించుకున్న జగన్‌మోహన్‌రెడ్డి వారధి మీదుగా గుంటూరుకు పయనమయ్యారు. పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కె.పార్థసారథి, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దుట్టా రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు, జగ్గయ్యపేట అసెంబ్లీ అభ్యర్థి సామినేని ఉదయభాను, పార్టీ నేతలు తలశిల రఘురామ్, డాక్టర్ శివభరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.