కిరణ్కు మిగిలేది బెర్లిన్ గోడ ముక్కేనా?
దొంగలు పడ్డ ఆరు నెలలకు.. ఏదో అయినట్లు హడావుడి చేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడంలేదు. నమ్ముకున్న నలుగురైదుగురు నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు దగ్గరుండి కాంగ్రెస్ అధిష్ఠానానికి సహకరించిన ఆయన, అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన వెంట పట్టుమని పదిమంది నాయకులు కూడా ఉన్న పాపాన కనిపించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తానంటూ గొంతుచించుకుని మైకు పట్టుకుని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు తాను స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో తానొక్కరే మిగిలేలా ఉన్నారు. ఆయనతో పాటు పలు సందర్భాల్లో ఆయన చూపిస్తున్న బెర్లిన్ గోడ ముక్క కూడా ఉండేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి అనుంగు అనుచరులుగా భావిస్తున్నవాళ్లంతా ఒక్కొక్కరుగా ఆయన పెట్టిన పార్టీకి దూరం అయిపోతున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారం ఊపందుకోక ముందే జేఎస్పీకి నాయకులు దండం పెట్టేస్తున్నారు. మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ పక్కచూపులు చూస్తున్నారు. అందరికంటే ముందుగా మేల్కొన్న వ్యక్తి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్. టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమైపోయినట్లు సమాచారం. మరో సీనియర్ నేత సాయిప్రతాప్ కూడా కిరణ్ పార్టీలో ఉంటే పరువు దక్కదని డిసైడైపోయారట. అందరికంటే ముందు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వెంట కుడిభుజంగా నిలిచిన పశ్చిమగోదావరి జిల్లా నేత పితాని సత్యనారాయణ కూడా.. ఇప్పుడు జేఎస్పీలో ఉంటే కష్టమని నిర్ణయించుకుని టాటా చెప్పేద్దామనుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా చూస్తుంటే చివరాఖరుకు పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరు, ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న బెర్లిన్ గోడముక్క మాత్రమే మిగిలినా ఆశ్యర్యపోనవసరం లేదని జేఎస్సీ వర్గాలే గుసగుస లాడుతున్నాయట.