లక్నో: ఎన్నికలకు బరిలో దిగుతున్న అభ్యర్థులు వారి వారి గెలుపును కోరుతూ గుళ్లూ, గోపురాలు చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఓటరు దేవుళ్లతో పాటు ఆ భగవంతుని కరుణా కటాక్షాలు అవసరమని అభ్యర్ధులు బలంగా నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. అందుకే ప్రచారం చేస్తూ ఓటరు దేవుళ్లను, ప్రదక్షిణలు చేస్తూ గుళ్లో దేవుళ్లను గెలిపించమంటూ వేడుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ.. ఆ సమస్యను అధిగమించేందుకు ఏ మార్గాన్ని వదలడం లేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్టీ గెలుపు కోసం యజ్ఞాలు నిర్వహించారు. ములాయం కుటుంబ జ్యోతిష్యుడు ఉషా పారిఖ్ ప్రత్యేక పూజలు చేయాలని సూచించారని, కుటుంబ సభ్యులు ధరించేందుకు కొన్ని ప్రత్యేకమైన రాళ్లను తెప్పిస్తున్నారని సమాచారం.
అలాగే, ములాయం మేనల్లుడు ధర్మేంద్రయాదవ్ పార్టీ గెలుపు కోసం ఓ ప్రత్యేక తాంత్రిక పూజను నిర్వహిస్తున్నారట. ఆయన బాధౌన్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. జ్యోతిష్యం, యజ్ఞయాగాదుల పట్ల గట్టి నమ్మకం ఉన్న బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా తన గెలుపు, తన పార్టీ గెలుపు కోసం ప్రత్యేకంగా విజయ యజ్ఞాలనునిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారట.