సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికలు సరికొత్త రాజకీయాలకు తెరలేపాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని వ్యక్తులు హఠాత్తుగా ప్రధాన పార్టీలకు అభ్యర్థులయ్యారు. శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. వీరిలో అంతో ఇంతోరాజకీయ నేపథ్యమున్న వారు కొందరైతే.. రాజకీయాలకు సంబంధంలేని వారు మరికొందరు. జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ స్థానాల్లో అన్ని పార్టీల నుంచి కొత్త ముఖాలు తెరమీదకొచ్చాయి. మొత్తమ్మీద 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లా రాజకీయాల్లో నయా నాయకులు దర్శనమిస్తున్నారు.
నేరుగా చట్టసభలకే..
ఇప్పటివరకు చట్టసభలకు ఎన్నికైన పలువురు నాయకులు క్షేత్రస్థాయిలో రాజకీయంగా పేరెన్నిక గలవారో.. స్థానిక ఎన్నికల నుంచి నేతలుగా ఎదిగినవారో ఉండేవారు. తాజాగా ట్రెండు మారింది. దీంతో నేరుగా చట్టసభల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తున్న కొత్త నేతలు ప్రచార పర్వంలో ఉత్సాహభరితంగా దూసుకుపోతున్నారు.
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తూళ్ల వీరేందర్‌గౌడ్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ హోంమంత్రి టి.దేవేందర్‌గౌడ్ తనయుడైన వీరేందర్ గతంలో రాాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కూడా మొదటిసారిగా తలపడుతున్నారు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడిగా సుపరిచితుడైనప్పటికీ ఎన్నికల పోటీలో మాత్రం కొత్త ముఖమే. అదేవిధంగా ఇదే స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఎన్నికలకు కొత్త వ్యక్తే. దివంగత ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి మనవడిగా స్థానికంగా పేరున్నప్పటికీ తొలిసారిగా ఎన్నికల రణంలో నిలిచారు.
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కొత్త అభ్యర్థుల హవా కనిపిస్తోంది. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి సుపరిచితులే అయినప్పటికీ.. రాజకీయాలకు మాత్రం కొత్తే. ఈయన వైఎస్సార్ సీపీ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన సీఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్‌గా సొసైటీలో పేరున్నప్పటికీ.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగారు.
ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న బండారు లక్ష్మారెడ్డి కూడా మొదటిసారిగా ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడైన లక్ష్మారెడ్డికి ప్రత్యక్ష రాజకీయల్లోకి రావడం ఇది కొత్తే. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి కూడా కొత్తగా ఎన్నికల్లో నిలిచిన వ్యక్తే.
ఎల్‌బీనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆర్.కృష్ణయ్య రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత. ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాజా ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేస్తున్న కృష్ణయ్యను ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.
తాండూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నరేష్ సైతం మొదటిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్ర భుకుమార్ కూడా మొదటిసారిగా పోటీలో నిలిచారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర ్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి క్రాంతికుమార్ సైతం కొత్తవారే కావడం గమనార్హం.
నయా నాయకులు!
Published Fri, Apr 25 2014 12:20 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement