పాత మిత్రపక్షం టీడీపీపై వామపక్షాలు మండిపడుతున్నా యి. మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో పొత్తు కుదుర్చుకుని చంద్రబాబు లౌకికతత్వానికి తిలోదకాలు ఇచ్చారని ధ్వజమెత్తుతున్నాయి.
బీజేపీతో పొత్తుకట్టిన బాబుపై వామపక్షాల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: పాత మిత్రపక్షం టీడీపీపై వామపక్షాలు మండిపడుతున్నా యి. మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో పొత్తు కుదుర్చుకుని చంద్రబాబు లౌకికతత్వానికి తిలోదకాలు ఇచ్చారని ధ్వజమెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. వామపక్షాల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చించిన సీపీఐ, సీపీఎం నేతలు టీడీపీ, బీజేపీ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చాయి. బీజేపీ వత్తాసుతో చంద్రబాబు గెలిస్తే రాష్ట్రం మరింత అధోగతి పాలవుతుందన్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నాయి.
అభివృద్ధికి తాను, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ నమూనాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా పరిగణించాయి. గోద్రా మారణకాండను వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించడంతోపాటు.. ఆ సందర్భంగా మోడీని ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడానికే అనుమతించనన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించాయి. అవినీతిమయమైన యూపీఏపై ఉన్న ప్రజాగ్రహాన్ని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు బాబు వత్తాసు పలికితే ఘోరంగా దెబ్బతినక తప్పదని హెచ్చరిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర విభజన సందర్భంగా బీజేపీ, చంద్రబాబు అనుసరించిన వైఖర్ని దునుమాడనున్నాయి. విభజనను బీజేపీ, టీడీపీ ఎన్నడూ వ్యతిరేకించలేదని, ఒక పార్టీ బాహాటంగానే మద్దతు పలికితే టీడీపీ పరోక్షంగా సహకరించిందన్న అభిప్రాయం సీమాంధ్రలో ఉందని, దాన్నే విస్తృతంగా ప్రచారం చేస్తామని కమ్యూనిస్టు పార్టీలు పేర్కొంటున్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు ఓటేయాలని కోరుతూ.. మతతత్వవాదులను, వారికి సహకరిస్తున్న చంద్రబాబు వంటి వారిని ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.