స్థానిక వేడి
సాక్షి, గుంటూరు
పల్లెలు... పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. పట్టణాల్లో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంటే... పల్లెల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేడి రాజుకుంది.
ఇక ఉపసంహరణకు ఒక్కరోజే గడువుండటంతో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. జడ్పీటీసీ స్థానాలకు తిరస్కరించిన ఏడు నామినేషన్లలో వైఎస్సార్ సీపీ, టీడీపీలకు చెందిన నలుగురు అభ్యర్థులు జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్‌కు శనివారం అప్పీలు చేసుకున్నారు.
ఆదివారం వారి నామినేషన్లపై జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్తులో విచారణ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు రూరల్ అభ్యర్థి వడ్రాణం ప్రసాదరావు, నకరికల్లు వైఎస్సార్ సీపీ అభ్యర్ధిని సామ్రాజ్యం బాయి, అమరావతి, భట్టిప్రోలు మండలాలకు టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బోనబోయిన సుజాత, రేపల్లె స్థానానికి దాఖలు చేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌లు కలెక్టరు ఎదుట విచారణకు హాజరయ్యారు.
వీరిలో నకరికల్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థిని సామ్రాజ్యం బాయి నామినేషన్ ఒక్కటే ఆమోదిస్తున్నట్లు కలెక్టరు ప్రకటించారు. అనంతరం కలెక్టరు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పొన్నూరు రూరల్ వైఎస్సార్ సీపీ అభ్యర్ధి వడ్రాణం ప్రసాదరావు తన కాంట్రాక్టరు లెసైన్సు రద్దు చేసుకున్నది నిజమేనని, ఆమోదం పొందినది వాస్తవమేనని, కానీ రద్దు చేసినప్పుడు బకాయిలు, పనులు చేయాల్సి ఉన్నందున నామినేషన్ తిరస్కరించినటుట చెప్పారు.
ఇప్పటికీ నాలుగు గ్రామాల్లో పనులు జరుగుతున్నందున చట్ట ప్రకారం నామినేషన్ ఆమోదించలేదని పేర్కొన్నారు. నకరికల్లులో వైఎస్సార్ సీపీ అభ్యర్ధిని సామ్రాజ్యం బాయి ఎస్టీ కులధ్రువ పత్రం జత చేయడంలో చిన్న పొరపాటు జరిగిందని, అది చిన్న విషయమేగాబట్టి ఆమె నామినేషన్‌ను ఆమోదించామన్నారు.
అమరావతి, భట్టిప్రోలు మండలాలకు టీడీపీ అభ్యర్ధినిగా నామినేషన్ దాఖలు చేసిన బోనబోయిన సుజాత, రేపల్లె స్థానానికి టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌లు ఈ నెల 9న రూరల్ ప్రాంతంలో ఓటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని, అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు చట్టం వేరుగా ఉంటుందని, స్థానిక ఎన్నికలకు వేరుగా ఉంటుందని కలెక్టరు స్పష్టం చేశారు.
10వ తేదీ ప్రచురించే జాబితాలో పేరు లేనందున వారి నామినేషన్ తిరస్కరించామన్నారు. జడ్పీ ఎన్నికలకు 6,500 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా, 4,242 జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 2 వేల బాక్సులు తమిళనాడు జిల్లా వెల్లూరు జిల్లా నుంచి తెప్పించనున్నట్లు చెప్పారు.
ఏప్రిల్ 6న జేఈఈ పరీక్ష ఉన్నందున ఆ రోజు ఎన్నికలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. గుంటూరులోనే ఎక్కువ పరీక్ష కేంద్రాలున్నందున గుంటూరు డివిజన్ ఎన్నికలు ఏప్రిల్ 8న నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు.
సోమవారం మూడు గంటల్లోపే ఉపసంహరణ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు దాఖలు చేసిన నామినేషన్లను సోమవారం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఆదివారం పలు మండలాలకు చెందిన నామినేషన్లు నేతలు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ అనంతరం జడ్పీటీసీ స్థానాలకు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా విడుదల కానుంది.