
నామినేషన్ల జోరు
లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం రెండో రోజైన గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 50 నామినేషన్లు దాఖలయ్యాయి.
బరిలో హేమాహేమీలు
నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు మాజీ సీఎంలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం రెండో రోజైన గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 50 నామినేషన్లు దాఖలయ్యాయి. కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, మల్లిఖార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రులు ధరం సింగ్, బీఎస్. యడ్యూరప్ప, డీవీ. సదానందగౌడలు తమ నియోజక వర్గాల్లో నామినేషన్లను సమర్పించారు. మంచి రోజనే విశ్వాసంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులు రంగంలో దిగారు.
సదానంద గౌడ బెంగళూరు ఉత్తర, యడ్యూరప్ప శివమొగ్గ, మల్లిఖార్జున ఖర్గే గుల్బర్గ, వీరప్ప మొయిలీ చిక్కబళ్లాపురం, ధరం సింగ్ బీదర్ నియోజక వర్గాల్లో నామినేషన్లను దాఖలు చేశారు. బెంగళూరు సెంట్రల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రిజ్వాన్ అర్షద్ బరిలో దిగారు. ప్రస్తుతం ఎంపీలు అనంత్ కుమార్ హెగ్డే ఉత్తర కన్నడ, నళిన్ కుమార్ కటీల్ దక్షిణ కన్నడ, మాజీ ఎమ్మెల్యే ఎం. నారాయణ స్వామి కోలారు నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లను సమర్పించారు.
వివాదాస్పదంగా మారిన మైసూరు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా జర్నలిస్టు ప్రతాప్ సింహ నామినేషన్‌ను దాఖలు చేశారు. మాజీ మంత్రి విజయ్ శంకర్ ఈ స్థానాన్ని ఆశించినప్పటికీ, హాసన నియోజక వర్గాన్ని కేటాయించడంతో తొలుత అసంతృప్తికి గురయ్యారు. తదనంతరం పార్టీ ఆదేశాల మేరకు సింహ విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఆయా పార్టీల అభ్యర్థులు కార్యకర్తలతో ఊరేగింపుగా వెళ్లి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లను సమర్పించారు.
అనంతరం విజయం తమదేనంటూ ఆయా పార్టీల అభ్యర్థులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇప్పటి వరకు రూ.75 వేల నగదు, రెండు వేల టీ షర్టులు, రూ.60 లక్షల విలువైన 8,700 లీటర్ల మద్యం, 63 చీరలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా తెలిపారు.