సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభ నుంచి రాజ్యసభ, శాసన మండళ్లకు ఈ నెల 19న జరుగనున్న ద్వైవార్షిక ఎన్నికలకు శనివారం బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభలో నాలుగు, శాసన మండలిలో ఏడు స్థానాలకు జరగాల్సిన ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు సోమవారం ముగియనుంది.
రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ ప్రభాకర కోరె, శాసన మండలికి అదే పార్టీ అభ్యర్థిగా కేఎస్. ఈశ్వరప్ప నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్ర మంత్రి అనంత కుమార్, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషిలు అభ్యర్థుల వెంట ఉన్నారు. ప్రభాకర కోరె, ఈశ్వరప్పలు శాసన సభ కార్యదర్శి ఓం ప్రకాశ్‌కు నామినేషన్లను సమర్పించారు.
మరో వైపు రాజ్యసభకు జేడీఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకుడు కుపేంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం కుతూహలాన్ని రేపుతోంది. ఈ ఎన్నికలో గెలవడానికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా జేడీఎస్‌కు 40 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్‌కు ఇద్దరు అభ్యర్థులను సులభంగా గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది. ఆ పార్టీకి ఇంకా 30 మిగులు ఓట్లు ఉంటాయి.
ఇప్పటికే ఆ పార్టీ తరఫున ఎస్‌ఎం. కృష్ణ, బీకే. హరిప్రసాద్‌ల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు చెబుతున్నా, కృష్ణ విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని గెలుచుకోవడానికి అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి ఉంది. కనుక కుపేంద్ర రెడ్డి కాంగ్రెస్ మిగులు ఓట్లపై కన్నేసినట్లు చెబుతున్నారు.
ఇక శాసన మండలిలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ నాలుగు, బీజేపీ, జేడీఎస్ చెరో స్థానాలను సులభంగా గెలుచుకునే అవకాశాలున్నాయి. ఏడో అభ్యర్థిగా బీజేపీకి చెందిన యూబీ. మల్లికార్జున్ నామినేషన్‌ను దాఖలు చేశారు. జేడీఎస్ ఆయనకు మద్దతు ప్రకటించింది. ఆయన నామినేషన్ దాఖలు చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్, బీజేపీ ఎమ్మెల్యే సతీశ్ రెడ్డి ప్రభృతులున్నారు.
కాంగ్రెస్ జాబితా కోసం ఎదురు చూపు
ఈ ఎన్నికలకు కాంగ్రెస్ జాబితా కోసం పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు. శాసన మండలి స్థానాలకు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మాజీ మంత్రులు హెచ్‌ఎం. రేవణ్ణ, రాణి సతీశ్‌లతో పాటు ఐవాన్ డిసౌజా లేదా నివేదిత ఆళ్వా పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది.
రాజీవ్ గౌడకు ఛాన్స్?
రాజ్యసభ నుంచి ప్రస్తుతం ఎస్‌ఎం. కృష్ణ, బీకే. హరిప్రసాద్‌లు రిటైర్ కానున్నారు. తిరిగి వీరినే ఎగువ సభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో కృష్ణ స్థానంలో ప్రొఫెసర్ రాజీవ్ గౌడను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐఐఎంలో పని చేసి రిటైరైన రాజీవ్ ప్రస్తుతం కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
వయో భారం వల్ల కృష్ణ బదులు గౌడను ఎంపిక చేయాలని అధిష్టానం చివరి నిమిషంలో నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సాకుతో గతంలో ఆయనను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయించింది. కాగా రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కక పోవడంతో ఎస్‌ఎం. కృష్ణను కాంగ్రెస్‌ను వీడనున్నారని ప్రచారం జరిగినా, ఆయన ఖండించారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, కేవలం రాజ్యసభ సీటు కోసం పార్టీని వీడబోనని స్పష్టం చేశారు.
బీజేపీ, జేడీఎస్ నామినేషన్లు
Published Sun, Jun 8 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM
Advertisement
Advertisement