బీబీఎంపీ మేయర్‌గా శాంతకుమారి
- డిప్యూటీ మేయర్‌గా రంగన్న
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీబీఎంపీ కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన శాంత కుమారి, ఉప మేయర్‌గా కే. రంగన్నలు శుక్రవారం ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. కే. శాంత కుమారి మూడలపాళ్య, రంగన్న కామాక్షిపాళ్య వార్డులకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీబీఎంపీ కెంపేగౌడ ఆడిటోరియంలో ఈ ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా, ఉదయం పదిన్నర గంటలకు శాంత కుమారి రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
పార్టీ సీనియర్ సభ్యులు ఎస్‌కే. నటరాజ్, బీ. సోమశేఖర్‌లు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఎమ్మెల్యే అశ్వత్థ నారాయణ బలపరిచారు. రంగన్న అభ్యర్థిత్వాన్ని సీకే. రామమూర్తి, సుగుణా బాలకృష్ణ ప్రతిపాదించగా, హెచ్. సురేశ్, సరస్వతమ్మ బలపరిచారు. ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉండగా, మరెవరూ సమర్పించక పోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మునిసిపల్ శాఖ ప్రాంతీయ కమిషనర్ గౌరవ్ గుప్తా ప్రకటించారు. అనంతరం
వారిద్దరినీ పార్టీ సభ్యులతో పాటు ఇతర పార్టీల వారు అభినందించారు. కాగా ఈ ఎన్నికల తర్వాత 12 స్థాయీ సంఘాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉండగా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రామలింగా రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడ్డాయి.
చెత్త సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యత
నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యతను ఇస్తానని శాంత కుమారి తెలిపారు. మేయర్‌గా ఎన్నికైన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెత్త తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు. చెత్తను సంస్కరించడానికి ఇప్పటికే నాలుగు బయోమెథనైజేషన్ యూనిట్లను ఏర్పాటు చేశామని, త్వరలోనే మరి కొన్ని యూనిట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. బెంగళూరుకు ఉద్యాన నగరి అని ఉన్న పేరును సార్థకం చేయడానికి ప్రతి వార్డులోనూ పార్కులను నిర్మిస్తామని తెలిపారు. బీబీఎంపీ పాఠశాలలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మరిన్ని అండర్‌పాస్‌లు, ఫ్లైవోవర్‌లు నిర్మిస్తామని ఆమె వెల్లడించారు.