- బరిలో నలుగురు
- ముందంజలో రవీంద్ర, పద్మరాజ్
- అశోక్ నేతృత్వంలో చర్చలు
- అనంతకుమార్ నిర్ణయమే ఫైనల్?
బెంగళూరు : బీబీఎంపీ కొత్త మేయర్ ఎంపికలో ఉత్కంఠ నెలకొంది. కాబోయే మేయర్ అవధి కేవలం ఏడు నెలలే ఉండటంతో సమర్థవంతమైన వ్యక్తిని నియమించి మళ్లీ పాలికె ఎన్నికల్లో గెలుపొందాలని కమలనాథులు వ్యూహా లు రచిస్తున్నారు. అందులో భాగంగా గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ నేతృత్వంలో పార్టీ నాయకులు, బీబీఎంపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు.
ఆ పదవిని తమకు కట్టబెట్టాలంటూ పార్టీపై పలువురు ఒత్తిళ్లు తెస్తున్నారు. ఆ పదవి కోసం సుమారు 10 మందికి పైగా పోటీపడ్డారు. అయితే చివరకు సీనియర్ కార్పొరేటర్లు నంజుండప్ప, రవీంద్ర, శాంతకుమార్, హెచ్‌ఎస్ పద్మరాజ్ మిగిలారు. వారిలో రవీంద్ర, పద్మరాజ్ ముందంజలో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం బాగా పని చేశారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వద్ద రవీంద్ర మార్కులు కొట్టేశారు. అంతేకాకుండా ఆయనకు అశోక్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి.
ఇక సమాజ సేవ కుడు, సీనియర్ కార్పొరేటర్ పద్మరాజ్‌కు మాజీ మంత్రి సురేష్ కుమార్ అండ ఉంది. వీరిద్దరి కాని పక్షంలో నంజుండప్ప, శాంతకుమారిలో ఒకరికి ఆ అవకాశం ఇవ్వాలని కమలనాథుల ఆలోచన. డిప్యూటీ మేయర్ రేసులో ఇద్దరు ఉన్నారు. శుక్రవారం నూతన మేయర్‌కు ఎన్నిక జరగాల్సి ఉంది. సమావేశం అనంతరం అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ ఢిల్లీ వెళ్లారని, ఆయన వచ్చిన తర్వాత కోర్ కమిటీతో, పార్టీ కార్పొరేటర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.