ఎన్‌కౌంటర్ చేయండి
- అత్యాచారం ఘటనపై తీవ్రంగా స్పందించిన శాసనసభ
- దోషులను కఠినంగా శిక్షించాలని సభ్యుల డిమాండ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ఫ్రేజర్ టౌన్‌లో ఓ పీజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి పట్ల బుధవారం శాసన సభ తీవ్రంగా స్పందించింది. దోషులను పట్టుకుని కఠిన శిక్ష పడేట్లు చూడాలని పార్టీల రహితంగా సభ్యులందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిని పట్టుకుని కాల్చేయాలనే వాదనలు కూడా వినిపించాయి. సభ్య సమాజం తల దించుకునేలా ఉన్న ఈ సంఘటనకు కారకులైన వారు, ఎవరైనా సరే ఉపేక్షించ వద్దని సూచించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఉప నాయకుడు, మాజీ హోం మంత్రి ఆర్. అశోక్ ఈ అంశాన్ని లేవనెత్తారు.
ఇతర బీజేపీ సభ్యులు కేజీ. బోపయ్య, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, సీటీ. రవి, సునీల్ కుమార్, గోవింద కారజోళ ప్రభృతులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అశోక్ మాట్లాడుతూ బెంగళూరు అపాయకరమైన నగరమనే అర్థం ధ్వనించే శీర్షికలతో పత్రికల్లో ఈ సంఘటన గురించి ప్రస్తావించారని తెలిపారు. యువతి ఇంటి ఎదుటే ఆమెను అపహరించుకుని పోవడం దారుణమైన విషయమని, ఇది సిగ్గుతో తల వంచుకునే అంశమని అన్నారు. పత్రికల్లో వచ్చే వార్తలను ప్రజలు విశ్వసిస్తారు కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు జ్ఞాన భారతిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుందని గుర్తు చేస్తూ, నిందితులను గూండా చట్టం కింద అరెస్టు చేసినందున, ఇప్పటికీ వారు బయటకు రాలేక పోయారని తెలిపారు. కనుక ఈ సంఘటనలోనూ లైంగిక దాడికి పాల్పడిన వారిపై గూండా చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప కొందరు పోలీసు అధికారులు సంవత్సరాల తరబడి ఒకే చోట తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నారని ఆరోపించారు. అలాంటి వారిని మొదట బదిలీ చేయాలని సూచించారు.
లైంగిక దాడుల్లో పాల్గొంటున్న కొందరికి ‘గాడ్ ఫాదర్లు’ ఉన్నారని, అయినప్పటికీ అలాంటి వారిని ఉపేక్షించవద్దని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే సమాధానమిస్తూ, తప్పు చేసిన వారు ఎవరైనా సరే, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దర్యాప్తు సజావుగా సాగేలా చూస్తామని, ఈ సంఘటనను సీఎం, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలను చేపడతామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి గూండాలను ఎన్‌కౌంటర్ చేయాలని, రెండు, మూడు తలలు తెగి పడితే ఇలాంటి సంఘటనలు నిలిచి పోతాయని సూచించారు.
రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల మెడల్లో గొలుసు దొంగతనాలు ఎక్కువైన సందర్భంలో అప్పటి హోం మంత్రి రాచయ్య ఎన్‌కౌంటర్లకు ఆదేశించారని గుర్తు చేశారు. ఇద్దరు, ముగ్గురు దొంగలు మరణించిన తర్వాత ఆ సంఘటనలు నిలిచిపోయాయని తెలిపారు. అప్పట్లో మంత్రి వర్గ సమావేశంలో ఓ మంత్రి ఎన్‌కౌంటర్లపై వ్యతిరేకత వ్యక్తం చేసినప్పుడు ‘నువ్వు కూడా ఎన్‌కౌంటరై పోతావు’ అని రాచయ్య హెచ్చరించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా హోం మంత్రి అదే విధమైన పట్టుదలను ప్రదర్శించి, దోషులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
వెంటనే ఎన్‌కౌంటర్ చేయండి
స్పీకర్ ఈ దశలో మాట్లాడుతూ ప్రస్తుతం పోలీసు శాఖ అంటేనే ‘క్యాష్ అండ్ కాస్ట్’గా మారిపోయిందని విమర్శించారు. గూండాలను అంతమొందించడానికి రేపటి నుంచే ఎన్‌కౌంటర్లను ప్రారంభించండని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఆ యువతిపై జరిగిన దౌర్జన్యం నా బిడ్డపై జరిగి ఉంటే ఆ బాధ... చెప్పలేము అంటూ వాపోయారు. బీజేపీ మహిళా సభ్యురాలు శశికళ జొల్లే తదితరులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.