ఈల మోగలేదు...గోల చేయలేదు
నూతన రాజకీయాలు, నీతివంతమైన ఆదర్శ రాజకీయాలు.. భారత రాజ్యాంగం .... ఇది లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ నిత్యం చెప్పే మాటలు. ప్రస్తుతమున్న రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రజల చేతికి అధికారం రావాలి. రాజకీయాలంటే ఐదేళ్లకోసారి అధికార మార్పిడి కాదంటూ ఐదేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చదువుతున్న యువతతో పాటు, పట్టణ, నగర ఓటర్లలో ఆలోచనలు రేకెత్తించారు. నూతన విధానాల పేరిట వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఐదేళ్లు తిరిగిచూసేసరికి ఇప్పుడు లోక్ సత్తా అధినేత ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన విషయం స్పష్టమైంది.
జేపీ మాటల్లో చెప్పిన ఆదర్శాలను ఆచరణలో నిరూపించుకోలేక రాజకీయాల్లో నామమాత్ర పాత్రకు పరిమితమయ్యారు. ఐదేళ్ల కిందట కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ నియోజకవర్గ ప్రజలకు సైతం తాను చేయదల్చుకున్న నూతన రాజకీయాలేమిటో, అభివృద్ది ఏమిటో చూపించలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన మొదలుకొని.. అనేక అంశాల్లో జేపీ అనుసరించిన విధానం కూడా ఫక్తు రాజకీయ నాయకుడిలా పూటకో మాట తరహాలో ఉండటం.. ఆయనను అభిమానించినవారిలో సైతం వ్యతిరేకత వచ్చేందుకు కారణమైంది.
ఇక సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే.. జేపీ నేతృత్వంలోని లోక్ సత్తా పార్టీ మిగతా రాజకీయ పార్టీల్లాగే వ్యవహరించిందన్న విషయం స్పష్టమైంది. లోక్ సత్తాలో జేపీ తర్వాత పేరున్న నేత కటారి శ్రీనివాస్. ఆ తర్వాత చెప్పుకోదగిన నేతలెవరూ లేరు. ఆపార్టీలో మిగతా నేతల పేర్లు కూడా జనాలకు చేరనేలేదు. గత ఎన్నికల్లో లోక్ సత్తా గట్టి పోటీ ఇవ్వలేకపోయినప్పటికీ చాలాచోట్ల ఓట్లను చీల్చింది. హైదరాబాద్లో పలుచోట్ల బీజేపీ కన్నా మెరుగ్గా ఉండి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ....ఈల వేసి గోల చేసిన లోక్సత్తా ఈసారి మాత్రం ఎలాంటి సత్తా చూపలేకపోయింది. గత ఎన్నికల్లో వచ్చిన ఒక్క సీటును కూడా ఈసారి నిలుపుకోలేకపోయింది. ఆయన ఈ సారి లోక్ సభ సీటకు పోటీ చేసి 1,47,458 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మల్కాజిగిరి ఎంపీ స్థానానికి మారిన జేపీ.. అక్కడ గెలుపు కోసం సినీ ప్రముఖుల్ని వాడుకున్నారు. అంతే కాకుండా మోడీ బొమ్మను ప్రచారంలో ఉపయోగించుకోవటంతో పాటు పవన్ కల్యాణ్ మద్దతు కోసం పాకులాడినా ఫలితం లేకపోయింది. ఇంత చేసి.. బీజేపీతో అంటకాగినా జేపీ సత్తా చూపలేక మల్కాజ్గిరిలో సోదిలో లేకుండా పోయారు.
ఇవన్నీ ఇలా ఉండగా జేపీ నీతిమంతమైన రాజకీయాల గుట్టు విప్పారు ఆయన పార్టీ ఢిల్లీ కన్వీనర్ ఒకాయన. అంతర్గతంగా రాజకీయ నాయకులతో కుమ్మక్కు కావడం.. పారిశ్రామికవేత్తల కోసం సెటిల్మెంట్లు చేయడం, తన మేధావితనాన్ని అంత ఉపయోగించుకొని ఢిల్లీ స్థాయిలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలతో లాబీయింగ్ జరుపడం ద్వారా లోలోపల చీకటి వ్యవహారాలు చక్కదిద్దడంలో దిట్ట జేపీ అని ఆయన ఓ స్టింగ్ ఆపరేషన్లో కుండబద్దలు కొట్టడం సంచలనం సృష్టించింది.